Site icon NTV Telugu

Pulwama Attack: పుల్వామా ఉగ్రదాడికి ఆరేళ్లు.. బాలాకోట్‌ ఎయిర్ స్ట్రైక్స్‌తో పాకిస్తాన్‌కి బదులు..

Pulwama Attack

Pulwama Attack

Pulwama Attack: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ‘‘పుల్వామ ఉగ్రదాడి’’కి ఆరేళ్లు గడిచాయి. 2019, ఫిబ్రవరి 14న పేలుడు పదార్థాలతో నిండిన కారు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుని ఢీకొట్టింది. ఈ దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడింది.

జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారి గుండా, దాదాపుగా 2500 మంది సైనికులతో 78 బస్సులు వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. వేగంగా వచ్చిన కారు కాన్వాయ్‌కి సమీపంలోకి వచ్చి, బస్సును ఢీకొట్టింది. అవంతిపోరాలోని గోగిపారా వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు తునాతునకలైంది. జవాన్ల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఈ దాడి తర్వాత అక్కడే దాక్కున్న ఉగ్రవాదులు సైనికులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే దాడి నుంచి తేరుకున్న జవాన్లు ప్రతిదాడి చేశారు.

బాలాకోట్ వైమానిక దాడితో పాక్‌కి బదులు:

ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉగ్రవాదం, పాకిస్తాన్ పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయితే, దాడి జరిగిన 12 రోజులు తర్వాత, అంటే ఫిబ్రవరి 25, 2019లో భారత వైమానిక దళం పాకిస్తాన్ బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

పుల్వామా వెనక ఉన్నది ఎవరు:

పుల్వామా దాడిలో పేలుడు పదార్థాలు నిండిన కారును నడిపిన వ్యక్తిని 22 ఏళ్ల ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్‌గా గుర్తించారు. ఘటనకు రెండేళ్ల క్రితమే అతను జైషే మహ్మద్‌లో చేరాడు. చివరిసారిగా 2018లో కాశ్మీర్‌లోని తన ఇంటికి వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత అతను ఇంటిని వదిలి వెళ్లి తిరిగి రాలేదు.

ఆత్మాహుతి బంబార్ ఆదిల్ అహ్మద్ దార్‌ని పోలీసులు వివిధ కేసుల్లో 6 సార్లు అదుపులోకి తీసుకున్నారు. ప్రతీసారి హెచ్చరించి వదిలేశారు. పుల్వామా దాడికి ప్రధాన సూత్రధారి జైష్ ఉగ్రవాది కమ్రాన్. అతను ఫిబ్రవరి 18, 2019న భద్రతా దళాలు చేసిన ఎన్‌కౌంటర్ లో హతమయ్యాడు. పుల్వామా ఉగ్రదాదికి 10 కి.మీ దూరంలో 12 గంటల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో కమ్రాన్ హతమయ్యాడు. అతను జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్ కు అత్యంత సన్నిహితుడు.

Exit mobile version