SIPRI Report: పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ సైన్యం భారత్‌పై దాడికి ప్రయత్నిస్తే, ఆ దేశ వైమానిక దళానికి చెందిన కీలకమైన ఎయిర్‌బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడులతో పాకిస్తాన్ అణు అహంకారం బద్ధలైంది. పాకిస్తాన్ భారత్‌లో ఉగ్రదాడి చేసిన ప్రతీ సందర్భంలో తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చేది. కానీ, సిందూర్‌లో భారత్ పాక్ అణ మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది. ముఖ్యంగా, పాక్ తన అణ్వాయుధాలను దాచి ఉంచే కిరాణా హిల్స్‌పై భారత్ దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే, స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(SIPRI) తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ అణు భద్రతా కవచాన్ని బద్దలు కొట్టిందని సిప్రి తన నివేదికలో పేర్కొంది. పాకిస్తాన్ అణ్వాయుధ మౌలిక సదుపాయాలతో సంబంధం ఉన్నాయని భావిస్తున్న ఎంపిక చేసిన పాకిస్తానీ వైమానిక స్థావరాలు మరియు క్షిపణి వ్యవస్థలను భారత వైమానిక దళం, సైన్యం నేరుగా లక్ష్యంగా చేసుకున్నాయని నివేదిక స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రధాన అణు కమాండ్, నియంత్రణ కేంద్రంగా భావించే వ్యూహాత్మక నూర్ ఖాన్ ఎయిర్ బేస్ భారత్ దాడిలో ధ్వంసమైంది. గతంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత్ పాకిస్తాన్ అణు భయాలను పటాపంచలు చేసిందని చెప్పారు. ఇప్పుడు సిప్రి నివేదిక కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేసింది.

