NTV Telugu Site icon

Chinmayi Sripaada: ఒకే వేదికపై స్టాలిన్, కమల్ హాసన్, వైరముత్తు.. లైంగిక వేధింపుదారుడంటూ సింగర్ చిన్మయి ఫైర్..

Chinmayi Sripaada

Chinmayi Sripaada

Chinmayi Sripaada: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో తమిళ పాటల రచయిత వైరముత్తుపై ఆమె లైంగిక ఆరోపణలు చేశారు. తనను వేధించినట్లు చిన్మయి ఆరోపించింది. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత పి. చిదంబరం, ప్రముఖ నటుడు కమల్ హాసన్‌తో కలిసి వైరముత్తు ఒకే వేదికను పంచుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సంబంధించిన ఫోటోను సోమవారం ట్వీట్ చేసిన చిన్మయి తీవ్ర స్థాయిలో స్పందించారు.

‘‘ నాపై నిషేధం ఉన్న సమయంలో తమిళనాడులోని అత్యంత శక్తివంతమైన కొందరు వ్యక్తులు నన్ను వేధించించిన వ్యక్తితో వేదిక పంచుకున్నారు.. నా కెరీర్‌లో కొన్ని ఏళ్లను నేను కోల్పోయాను’’ అని చిన్మయి ట్వీట్ చేశారు. వైరముత్తు ‘మహా కవితై’ అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా స్టాలిన్, చిదంబరం, కమల్ హాసన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also: Delhi Crime: 26 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్..

39 ఏళ్ల చిన్మయి, తనపై వైరముత్తు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. 2018లో #MeToo ఉద్యమ సమయంలో వందలాది మంది బాధితులు తమపై జరిగిన లైంగిక వేధింపులపై పెదవి విప్పారు. ఈ నేపథ్యంలో చిన్మయి తాజాగా వైరముత్తుతో పొలిటికల్, సినీ యాక్టర్లు వేదిక పంచుకోవడాన్ని విమర్శించారు. ‘‘ సెక్స్ నేరస్తులను ప్రోత్సహించే, మద్దతు ఇచ్చే మొత్తం వ్యవస్థ ఈ క్షణం నుంచి నాశనమైపోతుంది, నా కోరిక నెరవేరే దాకా నేను ప్రార్థిస్తాను, ప్రార్థిస్తూనే ఉంటాను- ఏమైనప్పటికీ నేను చేయగలిగింది ఏమీ లేదు’’ అంటూ ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

2019లో వైరముత్తుపై ఆరోపణలు చేసిన ఏడాది తర్వాత, మీడియా మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించారు. చాలా మంది వైరముత్తుకు రక్షణగా నిలుస్తున్నారంటూ ఆరోపించారు. డీఎంకేలోని చాలా మంది తనకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. వారి చేతులు కట్టేసి ఉన్నాయని ఆమె అన్నారు. ప్రభుత్వ మౌనాన్ని ప్రశ్నిస్తూ గతంలో సీఎం స్టాలిన్‌కి చిన్మయి లేఖ రాశారు. ఇప్పటి వరకు 17 మంది మహిళలు వైరముత్తుపై వేధింపుల ఆరోపణలు చేశారు.