టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో సిమ్ కార్డు కొనుగోలుదారుల కోసం కొత్త నిబంధనలు విధించింది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధన పోర్ట్ చేసే వారికి వర్తించనుంది. మొబైల్ నెంబర్‌ను వేరే ఆపరేటర్‌కు పోర్ట్ చేసుకునే మొబైల్ వినియోగదారులపై దీని ప్రభావం ఉంటుంది.
ట్రాయ్ నిబంధనల ప్రకారం.. వినియోగదారులు సిమ్ కార్డ్‌ని రీప్లేస్ చేసుకున్న లేదా కొనుగోలు చేసిన ఏడు రోజుల వరకు తమ నెంబర్‌ను పోర్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ మధ్యకాలంలో సిమ్ కార్డ్‌తో మోసాలు భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ట్రాయ్.. మొబైల్ నెంబర్‌లను పోర్టింగ్ చేసే విధానంలో స్వల్ప మార్పులు చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు సిమ్ కార్డును మార్చుకుంటే.. లేదా రీప్లేస్ చేసుకుంటే.. సంబంధిత మొబైల్ నంబర్‌ను వేరే టెలికాం ఆపరేటర్‌కు ఏడు రోజుల పాటు పోర్ట్ చేయడం సాధ్యం కాదని ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ నియమాలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రత్యేక పోర్టింగ్ కోడ్ కేటాయింపు అభ్యర్థనను రిజెక్ట్ చేయడానికి ప్రత్యేక విధానాన్ని కూడా తీసుకువచ్చింది.
మొబైల్ నెంబర్‌ను ఒక టెలికాం ఆపరేటర్ నుంచి మరొక టెలికాం ఆపరేటర్‌కు బదిలీ చేయడానికి యూపీసీ కోడ్ తప్పనిసరి. అయితే కొత్త నిబంధన ప్రకారం.. సిమ్ స్వాప్, మొబైల్ నెంబర్‌ను మార్చిన తేదీ నుంచి ఏడు రోజుల గడువు ముగిసేలోపు యూపీసీ కోసం అప్లై చేస్తే.. యూపీసీ కేటాయించడం జరుగదు. ఇలా చేయడం వలన సిమ్ సంబంధిత మోసాలను అరికట్టవచ్చునని ట్రాయ్ పేర్కొంది.