Site icon NTV Telugu

Neha Murder Case: నేహ తండ్రికి క్షమాపణ చెప్పిన సీఎం సిద్ధరామయ్య..

Neha

Neha

Neha Murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో ఎంసీఏ విద్యార్థిని నేహ హత్య ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ కుమార్తె అయిన నేహను కాలేజ్ క్యాంపస్‌లోనే ఫయాజ్ అనే వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడి చేసి చంపాడు. ఈ ఘటన బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. కాంగ్రెస్ ఇది వ్యక్తిగత హత్య అని చెబుతుంటే, బీజేపీ మాత్రం ఇది ‘లవ్ జిహాద్’ అని ఆరోపించింది. మరోవైపు నేహ తండ్రి కూడా తన కుమార్తెను చాలా రోజులుగా ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం సంచలనంగా మారింది.

Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి కస్టడీ పొడగింపు.. మరో 14 రోజులు జైలులోనే..

ఈ నేపథ్యంలో నేహకు న్యాయం జరగాలని బీజేపీ, రైట్ వింగ్ సంస్థలు హుబ్బళ్లితో పాటు కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు తెలిపాయి. ఆదివారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా నేహా తండ్రి కాంగ్రెస్ కార్పొరేటర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించడంతో పాటు సీబీఐ ఎంక్వైరీ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు నిందితుడు ఫయాజ్ తల్లిదండ్రులు.. నేహా కుటుంబాన్ని తమను క్షమించాలని కోరారు. నేహ తమ కూతురులాంటిదని వ్యాఖ్యానించారు. అయితే, వీరిద్దరు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్‌తో కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మాట్లాడారు. ఈ ఘటనకు ఆయన క్షమాపణలు కోరడంతో పాటు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ మంగళవారం హుబ్బళ్లిలోని ఆయన నివాసంలో నిరంజన్‌ హిరేమఠ్‌ను పరామర్శించగా.. ఫోన్‌లో మాట్లాడిన సీఎం క్షమాపనలు కోరారు. ఈ కేసులో సిద్ధరామయ్య సీఐడీ విచారణను కోరారు. నేరం తీవ్రమైందని, నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని అన్నారు.

Exit mobile version