NTV Telugu Site icon

Karnataka: లోపల కాంగ్రెస్ మీటింగ్.. బయట ఫైటింగ్.. బెంగళూర్‌లో టెన్షన్

Karnataka Congress

Karnataka Congress

Karnataka: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఏకంగా 34 ఏళ్ల తరువాత భారీగా ఓట్లను, సీట్లను సంపాదించింది. మొత్తం 224 సీట్లలో 135 సీట్లను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే సీఎం అభ్యర్థిత్వం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందా..? అనేది సస్పెన్స్ గా మారింది.

Read Also: CSK vs KKR: ముగిసిన చెన్నై బ్యాటింగ్.. కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం

ఇదిలా ఉంటే గెలిచినప్పటి నుంచి ఇద్దరు నేతల మద్దతుదారులు, అభిమానులు తమ నేతనే సీఎం అంటూ పోస్టర్లు వేయించారు. ఇక ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎల్పీ భేటీకి ముందు డీకే శివకుమార్ నివాసం ముందు ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరుకుని ‘‘శివకుమార్ సీఎం కావాలి’’ అంటూ నినాదాలు చేశారు. బెంగళూర్ లోని హోటల్ షాంగ్రీలా కేంద్రంగా సాయంత్రం సీఎల్పీ భేటీ జరిగింది. అయితే ఇందులో సీఎం ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే వదిలేస్తూ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఏకవాఖ్య తీర్మానం చేశారు.

హోటల్ లోపల నేతల మీటింగ్ జరుగుతుంటే.. బయట ఫైటింగ్ నెలకొంది. డీకే శివకుమార్, సిద్దరామయ్య మద్దతుదారులు నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. నాయకుల ఫోటోలు పట్టుకుని తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇరు వర్గాలను అక్కడ నుంచి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో డీకే, సిద్ధరామయ్య రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. వీరిద్దరిని ఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కోరారు.