NTV Telugu Site icon

UGC: 18 వైద్య కాలేజీలపై యూజీసీ కొరడా.. షోకాజ్ నోటీసులు జారీ

Ugc

Ugc

తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా 18 వైద్య కళాశాలపై యూజీసీ కొరడా ఝుళిపించింది. ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించని కాలేజీలపై సీరియస్ అయింది. దీంతో దేశ వ్యాప్తంగా 18 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జాబితాలో ఆంధ్రప్రదేశ్, బీహార్‌ నుంచి మూడు చొప్పున కాలేజీలు ఉండగా.. అస్సాం, ఢిల్లీ, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి రెండేసి కాలేజీలు ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఒక్కో కాలేజీ చొప్పున ఉన్నాయి. ఏపీ నుంచి ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌ (విశాఖ), గుంటూరు మెడికల్‌ కాలేజ్‌, కర్నూలు మెడికల్‌ కాలేజ్‌ ఉండగా.. తెలంగాణ నుంచి ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ ఉండటం విశేషం. ర్యాగింగ్ వ్యతిరేక చర్యలను అడ్డుకోకపోవడంతోనే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు యూజీసీ కార్యదర్శి మనీష్‌ జోషి వెల్లడించారు.

నిబంధనల ప్రకారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి యాంటీ ర్యాగింగ్‌ డిక్లరేషన్‌ను పొందడంలో విఫలమైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా సరైన కారణాలను, లోపాల్ని సరిదిద్దుకోవాలని.. తీసుకున్న చర్యల్ని వివరిస్తూ లిఖితపూర్వక వివరణ పంపాలని ఆదేశించినట్లు మనీష్‌ జోషి తెలిపారు. నిర్దేశిత గడువు లోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.