BJP vs Congress: మధ్యప్రదేశ్ ఎన్నికలు ముంచుకోస్తున్నాయి. గత 20 ఏళ్లుగా అక్కడ బీజేపీనే అధికారం చెలాయిస్తోంది. అయితే గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటు కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మళ్లీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు కర్ణాటకలో భారీ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. 2024 ఎన్నికలకు ముందు జరిగే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలవాలని ఆ పార్టీ భావిస్తుంది.
Read Also: Warangal: ప్రైవేట్ ఆస్పత్రుల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు..18మంది అరెస్ట్
ఇదిలా ఉంటే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వచ్చే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వస్తాయని అంచానా వేశారు. నిన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. పార్టీలో ఐక్యత గురించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత గురించి చర్చించారు. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అయిన కమల్ నాథ్ తో పాటు ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. కర్ణాటకలో ఇటీవల మాకు 135 సీట్లు వచ్చాయని, మధ్యప్రదేశ్ లో 150 సీట్లు సాధించబోతున్నామని, కర్ణాటకలో ఏం చేశామో అదే మధ్యప్రదేశ్ లో పునారావృతం అవుతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ కామెంట్స్ కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ 200 కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తుందని అన్నారు.