NTV Telugu Site icon

Nuclear Cargo: చైనా నుంచి పాక్ వెళ్తున్న నౌకని ముంబైలో నిలిపివేత.. “అణు కార్గో” ఉన్నట్లు అనుమానం..

Pak Ship

Pak Ship

Nuclear Cargo: చైనా నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తున్న ఓ కార్గో నౌకను భారత అధికారలు ముంబై పోర్టులో అడ్డుకున్నారు. పాకిస్తాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం వినియోగించే సరకు ఉందనే అనునమానంతో ముంబై నవ షేవా నౌకాశ్రయంలో భారత అధికారులు శనివారం నిలిపేశారు. కస్టమ్స్, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా.. జనవరి 23న కరాచీకి వెళ్లే మార్గంలోని వెళ్తున్న సీఎంఎ సీజీఎం అట్టిలా నౌకను నిలిపేశారు. నౌకలో ఉన్న సరుకును పరిశీలించారు. ఇందులో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్సీ) అనే యంత్రం ఉన్నట్లు, ఇది ఒక ఇటాలియన్ కంపెనీచే తయారు చేయబడినట్లు తెలుస్తోంది.

ఈ సీఎన్సీ మిషన్ కంప్యూటర్ ద్వారా నియంత్రించబడుతుంది. మాన్యువల్‌గా సాధ్యం కానీ సామర్థ్యం, స్థిరత్వాన్ని, ఖచ్చితత్వాల స్థాయిని ఉత్పత్తి చేస్తుంది. కార్గోను తనిఖీ చేసిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) బృందం, దీనిని పాక్ అణు కార్యక్రమానికి ఉపయోగించవచ్చని ధృవీకరించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాకిస్తాన్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి కీలకమైన భాగాలను తయారు చేయడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయి.

1996 నుంచి సీఎన్‌సీ యంత్రాలను “వాస్సెనార్ అరేంజ్‌మెంట్‌”లో చేర్చారు. ఇది పౌర, సైనిక ఉపయోగాలతో కూడిన పరికరాల విస్తరణను ఆపడానికి ఏర్పాటు చేయబడిని ఇంటర్నేషనల్ ఆర్మ్ కంట్రోల్ రెజిమ్. సాంప్రదాయ ఆయుధాలు మరియు ద్వంద్వ వినియోగ వస్తువులు, సాంకేతికతల బదిలీలపై సమాచారాన్ని మార్పిడి చేసుకునే 42 దేశాల సమూహం. ఇందులో భారత్ కూడా సభ్య దేశంగా ఉంది. సీఎన్‌సీ యంత్రాన్ని ఉత్తర కొరియా తన అణు కార్యక్రమంలో ఉపయోగించింది.

Read Also: Rameshwaram Cafe Blast: మంగళూర్, బెంగళూర్ పేలుళ్లకు లింక్.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..

తాజాగా నౌకలోని సరుకును స్వాధీనం చేసుకున్నామని, పాకిస్తాన్, చైనాల వ్యాప్తిని నిరోధించడం కిందకు ఈ స్వాధీనం వస్తుందని అధికారులు తెలిపారు. లోడింగ్, ఇతర పత్రాల ద్వారా ఈ సరకు షాంగై JXE గ్లోబల్ లాజిస్టిక్స్ కో లిమిటెడ్‌కి చెందినదని పేర్కొనబడింది. సియాల్‌కోట్‌కి చెందిన ‘‘పాకిస్తాన్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్’’ సరకు వెళ్తున్నట్లు తేలింది. భద్రతా సంస్థల విచారణలో 22,180 కిలోగ్రాముల బరువున్న ఈ సరుకును తైయువాన్ మైనింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ కో లిమిటెడ్ రవాణా చేసిందని, పాకిస్తాన్‌లోని కాస్మోస్ ఇంజనీరింగ్ కోసం ఉద్దేశించినదని అధికారులు తెలిపారు.

చైనా నుంచి పాకిస్తాన్‌కి ఎగుమతి అవుతున్న డ్యూయల్ యూజ్ మిలిటరీ గ్రేడ్ వస్తువులను భారత అధికారులు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి కాడు. కాస్మోస్ ఇంజనీర్, పాకిస్తాన్‌కి రక్షణ సరఫరాదారు. మార్చి 12, 2022లో నవ షేవా పోర్టులో ఇటాలియన్ నిర్మిత థర్మోఎలెక్ట్రిక్ పరికరాలను భారత అధికారులు అడ్డగించారు. యూరప్, యూఎస్ నుంచి నిషేధిత వస్తువులను కొనుగోలు చేయడానికి చైనాను ఒక మార్గంగా వినియోగించుకుంటోంది పాకిస్తాన్.