NTV Telugu Site icon

Sheikh Hasina: మరికొన్ని రోజులు ఇండియాలోనే షేక్ హసీనా.. ఏర్పాట్లు సిద్ధం..

Sheikh Hasina

Sheikh Hasina

Sheikh Hasina: బంగ్లాదేశ్ తీవ్ర హింస, ఆర్మీ హెచ్చరికలతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా నిన్న బంగ్లా ఆర్మీ విమానంలో ఇండియాకు చేరింది. ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆమె ప్రస్తుతం భారత అధికారుల రక్షణలో ఉంది. మరోవైపు ఇండియా నుంచి యూకే వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ, ఆశ్రయం ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా స్వల్పకాలి, దీర్ఘకాలిక ఆశ్రయం కోసం భారత భద్రతా సంస్థలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఆమెకు ఎదురవుతున్న వ్యతిరేకత దృష్ట్యా ఎక్కువ కాలంలో దేశంలోనే ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Read Also: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఉద్ధవ్ ఠాక్రే పొత్తు.. ఢిల్లీలో చర్చలు..

77 ఏళ్ల మాజీ ప్రధానికి యూరోపియన్ దేశాలు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భద్రతా ఏజెన్సీలు ఇప్పటికే ఆమె రక్షణ కోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత ప్రధాని మోడీతో కూడామ ఆమె సమావేశం జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. షేక్ హసీనా బస గురించి, యూరోపియన్ దేశాల్లో ఆమె ఆశ్రయం గురించి ఎప్పటికప్పుడు దోవల్ ప్రధాని మోడీకి అప్డేట్స్ అందిస్తున్నారు.

ప్రస్తుతం హిండన్ ఎయిర్ బేస్‌లోని ఆమెకు బస ఏర్పాటు చేశారు. త్వరలోనే విశాలమైన, సురక్షితమైన ప్రదేశానికి మార్చబడుతుందని తెలుస్తోంది. భారత్ ప్రధాని లేదా ఇతర దేశాల అధినేతలకు ఇచ్చే ప్రోటోకాల్‌నే షేక్ హసీనాకు ఇస్తోంది. షేక్ హసీనా బస కోసం దీర్ఘకాలిక ఏర్పాట్లను పరిగణలోకి తీసుకుని వైమానిక దళం, భద్రతా సంస్థలు ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్ నుంచి సఫ్దర్ జంగ్, పాలం విమానాశ్రయాల వరకు ప్రత్యేక కసరత్తు నిర్వహించాయి. ఆమె అంతర్గత భద్రత కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్‌జీ) కమాండోలను మోహరించినట్లు, వైమానిక దళానికి చెంది గరుడ్ కమాండోలు హిండన్ ఎయిర్ బేస్ బయట భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.