Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు!

  • హసీనా‌ను పంపించడానికి బంగ్లాకు భారత్ షరతులు..
  • మరణశిక్షపై అప్పీల్, బంగ్లా సైనిక బాధ్యత కోరుతున్న భారత్..
Sheikh Hasina Return

Sheikh Hasina Return

Sheikh Hasina Return: 2024 ఆగస్టు హింసాత్మక ఉద్యమం తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిపెట్టి భారత్ వచ్చారు. అప్పటి నుంచి హసీనా ఇక్కడే ఉంటున్నారు. మరోవైపు, మానవత్వానికి వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ కోర్టులు ఆమెకు మరణశిక్ష విధించాయి. ఇలాంటి పరిణామాలు ఉన్నప్పటికీ.. షేక్ హసీనా డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో వచ్చే నెల బంగ్లాలో ఏం జరుగుతుందా? అనే టెన్షన్ సర్వత్రా ఉంది.

ఇదిలా ఉంటే, షేక్ హసీనాు అప్పగించాలంటే తమకు గ్యారెంటీ ఇవ్వాలని భారత్ బంగ్లాదేశ్‌కు 2 షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఆమె భద్రతకు, న్యాయవిచారణకు హామీ ఇవ్వాలని కోరతున్నట్లు బీబీసీ బంగ్లా కథనం వెల్లడించింది. బంగ్లాదేశ్ సైన్యం పర్యవేక్షణలో ఆమెను స్వదేశానికి తీసుకెళ్లేలా భారత్ ప్లాన్ చేస్తోందని పేర్కొంది.

హసీనా రిటర్న్‌కు భారత్ షరతులు..?

హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించడానికి భారత్ రెండు షరతుల్ని ఆ దేశం ముందుంచినట్లు తెలుస్తోంది.
1) హసీనాను బంగ్లాదేశ్ తీసుకెళ్లే బాధ్యతను ఆ దేశ సైన్యమే తీసుకోవాలి. హసీనా విమానంలో ఢిల్లీ నుంచి తీసుకెళ్లినా, భూమార్గం ద్వారా బంగ్లాదేశ్ వెళ్లినా ఆమెను ఆ దేశ సైన్యం రిసీవ్ చేసుకోవచ్చని బీబీసీ బంగ్లా కథనం వెల్లడించింది. ఇందుకు అవసరమైన రవాణా, ఇతర ఏర్పాట్లలో సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

2) బంగ్లాదేశ్ కోర్టులు హసీనాకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని భారత్ కోరుతోంది. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని బంగ్లాకు భారత్ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఆమెను ఉరితీయడానికి తెలిసి తెలిసి అప్పగించలేమని, బదులుగా ఆమెకు న్యాయమైన విచారణకు అవకాశం లభించేలా చూడాలనుకుంటున్నామని భారత విదేశాంగ శాఖకు చెందిన ఒక వ్యక్తి చెప్పినట్లు బీబీసీ బంగ్లా వెల్లడించింది.

హసీనా తిరుగు ప్రయాణంపై భారత్, బంగ్లా తెర వెనక చర్చలు..?

హసీనాను తిరిగి స్వదేశానికి పంపించే విషయంపై భారత్, బంగ్లాదేశ్ తెర వెనక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో రెండు సైనిక వ్యవస్థలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పేర్కొంది. అక్టోబర్ మొదటివారంలో బంగ్లాలోని భారత హైకమిషనర్ దినేశ్ త్రివేది ఢిల్లీకి వచ్చి ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్‌తో సమావేశమైనట్లు బీబీసీ కథనం వెల్లడించింది. హసీనా తిరుగు ప్రయాణంలో బంగ్లా సైన్యం చురుకైన పాత్ర పోషించేలా చూడటమే ఈ భేటీలో కీలక విషయం కావచ్చని భారత సైనిక వర్గాలు చెప్పినట్లు బీబీసీ చెప్పింది.

హసీనా పాస్‌పోర్ట్ దరఖాస్తుకు స్పందన కరువు..

నవంబర్ 09న షేక్ హసీనా కొత్త పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రవాసంలో ఉంటున్న ఆమె తొలిసారి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదించినట్లైంది. అయితే, ఆమె దరఖాస్తుపై ఢాకా నుంచి ఇంకా స్పందన లేనట్లు తెలుస్తోంది.

మరోవైపు, షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ లోని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ దరఖాస్తు చేయడం ద్వారా హసీనా తన రాజకీయ తొలి అడుగును బంగ్లా ప్రభుత్వ కోర్టులోకి పంపించారని ఆ దేశ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ప్రెస్ సెక్రటరీ కేఎం నజ్ముల్ హక్ శుక్రవారం ఫేస్‌బుక్ పోస్టులో.. హసీనాకు ఆశ్రయం కల్పించడానికి ఏ దేశం ముందుకు రావడం లేదని, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఫిన్లాండ్, అమెరికా, బెలారస్, ఖతార్ సహా ఏ దేశమూ ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆఫ్రికాలోని ఏ దేశం కూడా ఆమెకు ఆశ్రయం కల్పించేందుకు ముందుకు రాలేదని అన్నారు. అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాతే హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తున్నారని ఆరోపించారు.