Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన

  • షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
  • అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు వెల్లడి
  • తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటన నేపథ్యంలో పరిశీలన
Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు రెండేళ్ల నుంచి షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. త్వరలోనే బంగ్లాదేశ్‌కు వెళ్లబోతున్నట్లుగా ఇప్పటికే షేక్ హసీనా ప్రకటించారు.

అయితే ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్.. షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్‌లో పర్యటిస్తానని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా అప్పగింత అంశంపై మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. షేక్ హసీనాను అప్పగించాలన్న అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థనలను స్థిరీకరించిన విధానాల ప్రకారం పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ మరోసారి డిమాండ్ చేసిన మరుసటి రోజే భారత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారత్‌లో పర్యటించాలంటే హసీనాను అప్పగించడం కూడా కీలక షరతుగా ఉండొచ్చని సమాచారం.

బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఏకేఎం షాహిదుల్ కరీం మాట్లాడుతూ.. తారిఖ్ రెహమాన్ ప్రతిపాదిత ద్వైపాక్షిక పర్యటనపై భారత్, బంగ్లాదేశ్ కొన్ని వారాలుగా సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు. అయితే ఈ పర్యటన జరగాలంటే ముందుగా ‘‘అనుకూలమైన వాతావరణం’’ ఏర్పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హసీనాను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్‌ను కోరినట్లు కరీం తెలిపారు. అలాగే బంగ్లాదేశ్‌లో ఉన్న ఇతర పరారీలో ఉన్న నిందితులను కూడా అప్పగించాలని కోరినట్లు చెప్పారు. రాజకీయ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని కూడా తమకు అప్పగించాలని ఢాకా కోరినట్లు వెల్లడించారు.

ఇదే సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ వైఖరిని కూడా రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ‘‘ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు చాలా తీవ్రమైనవి. వాటిని మేం అత్యంత తీవ్రంగా పరిగణిస్తాం. ఇలాంటి చర్యల తీవ్రతను అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. భారత్ ఉగ్రవాదం వల్ల తీవ్రంగా ప్రభావితమైంది’’ అని ఆయన అన్నారు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై సమష్టి పోరాటాన్ని బలోపేతం చేసేందుకు భారత్ అనేక ప్రయత్నాలు చేసిందని జైస్వాల్ తెలిపారు. సరిహద్దులు దాటి జరిగే ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ‘‘ఉగ్రవాదాన్ని ఓడించేందుకు అవసరమైన ఎలాంటి చర్యలైనా తీసుకోవడంలో భారత్ వెనుకడుగు వేయదు. ఈ ముప్పును నిర్మూలించే వరకు మా పోరాటం కొనసాగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.