Shashi Tharoor comments on congress president elections: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ కూడా తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి నుంచి శశిథరూర్ అధ్యక్ష ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఫ్రీ-ఫెయిర్ గా జరగలేదని ఆయన అన్నారు. ఎన్నికలు నిష్ఫక్షపాతంగా జరగలేదని వ్యాఖ్యానించారు.
దాదాపుగా 20 ఏళ్ల తరువాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని శశిథరూర్ ఆరోపించారు. పోటీలో మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం ఆమోదం లభించింది. బుధవారం ఉదయం 11 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగానే.. థరూర్ టీం ఎన్నికల్లో సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. కౌంటింగ్ లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎలక్షన్ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి ఫిర్యాదు చేసింది థరూర్ వర్గం. ఫోటోలు, కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు.
Read Also: Deputy Speaker Padma Rao: అవన్నీ పుకార్లే.. ఊపిరి ఉన్నంతకాలం టీఆర్ఎస్ తోనే
థరూర్ ఎన్నికల ఏజెంట్ సల్మాన్ సోజ్, మిస్త్రీకి లేఖ రాశారు. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఎక్కువగా అవకతవకలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు. అనధికారిక సీల్స్, బ్యాలెట్ బాక్సులు ఉపయోగించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 24 ఏళ్ల తరువాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో ఆరోసారి ఎన్నికలు జరిగాయి.
ఇదిలా ఉంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ల మద్దతు మల్లికార్జున ఖర్గేకు మద్దతు తెలిపారు. పోటీలు ఉన్న శశిథరూర్ కు పార్టీ నుంచి పెద్దగా మద్దతు రాలేదని ఆయన వర్గం ఆరోపిస్తోంది. ఖర్గే గెలిస్తే గాంధీల కుటుంబం రిమోట్ కంట్రోల్ పాలన చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. కాసేపట్లో రిజల్ట్స్ వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో శశిథరూర్ అంశం కాకపుట్టిస్తోంది. అయితే శశిథరూర్ రాసిన లేఖను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.
