NTV Telugu Site icon

Sharad Pawar: ఇంత జరుగుతుంటే నిద్ర పోతున్నారా.? మహా సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు

Sharad Pawar

Sharad Pawar

మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శివసేనతో పాటు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టిస్తోంది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే 35 మంది శివసేన ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో క్యాంప్ ఏర్పాటు చేయడంతో రాజకీయ సంక్షోభం మొదలైంది. తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు షిండే. శివసేన, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అల్టిమేటం విసురుతున్నారు.

ఇదిలా ఉంటే బుధవారం ఈ రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సమావేశాం అయ్యారు. ఈ సమయంలో హోంమంత్రిపై శరద్ పవార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు రాష్ట్రం వదిలిపెట్టి సూరత్ వెళ్తుంటే హోంశాఖ, పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని, మీరంతా పడుకున్నారా..? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్దారు. దాదాపుగా రెండు డజన్ల మంది ఎమ్మెల్యేలు ముంబై వదిలి సూరత్ వెళ్తుంటే కనీసం సీఎంఓ దగ్గర సమాచారం లేదా.? అని ప్రశ్నించారు. హోంశాఖ సహాయ మంత్రి శంభు రాజ్ దేశాయ్ కూడా శివసేన రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఉన్నారు. అధికారులతో పాటు మహావికాస్ అఘాదీలో కీలక నేతలపై శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా ఈ రోజు (గురువారం) ఎన్సీపీతో పాటు కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా సమావేశం అయ్యాయి. జరుగుతున్న పరిణామాలపై ఇరు పార్టీలు వేరువేరుగా చర్చించాయి. శరద్ పవార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇటు కాంగ్రెస్, అటు ఎన్సీపీలు ఇరు పార్టీలు శివసేనలో విభజన రావడానికి, ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి బీజేపీనే కారణం అని నిందిస్తున్నాయి. అయితే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కొనసాగుతుందని.. ఐదేళ్లు అధికారంలో ఉంటుందని నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 

Show comments