NTV Telugu Site icon

మళ్లీ తెరపైకి థర్డ్‌ ఫ్రంట్..! మోడీని ఢీకొట్టే నేత కోసం వేట..?

Opposition Meet

Opposition Meet

ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రస్తుతం దేశంలో పాపులారిటీ పరంగా బలమైన నేత..! ఆయన నిర్ణయాలు, వైఫల్యాలపై జనంలో ఆగ్రహం ఉన్నప్పటికీ.. మోడీకి సరి సమానమైన నాయకుడు లేరు. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను జనం ఆదరిస్తున్నా.. దేశం వరకు వచ్చే సరికి మోడీకి జై కొడుతున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన వరుస దెబ్బలతో విపక్షాలు అలర్ట్‌ అయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ను గత రెండు వారాల్లో రెండు సార్లు కలవడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి పవార్‌ని కలిశారు. దాదాపు గంట పాటు సాగిందీ సమావేశం. అయితే ఈ భేటీలో థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటుకు చేయాల్సిన ప్రయత్నాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మోడీకి ధీటైన నాయకుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అప్పుడే 2024లో బీజేపీని ఢీ కొట్టొచ్చన్న భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. శరద్‌పవార్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ ఈ నెల 12నే సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. థర్డ్‌ ఫ్రంట్‌ ఆలోచనకు ఇక్కడే బీజం పడినట్లు తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఎన్నికల్లో దీదీ, స్టాలిన్‌ విజయానికి ప్రశాంత్‌ కిశోర్‌ కీలకంగా పని చేశారు. దీంతో మూడో ఫ్రంట్‌ ప్రయత్నాల్లో పీకే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే కాదు వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ కూడా బీజేపీ వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. ఢిల్లీలో పీకేతో భేటీ ముగియగానే.. పవార్‌ విపక్షాల భేటీకి పిలుపునిచ్చారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత యశ్వంత్‌ సిన్హాకు చెందిన రాష్ట్ర మంచ్‌ తరపున నేతలందరికీ ఆహ్వానాలు అందాయి. దాదాపు 15 విపక్ష పార్టీలు మంగళవారం సమావేశమవుతాయి. ఈ భేటీకి కాంగ్రెస్‌తో పాటు ఆర్‌జేడీ, ఆమ్‌ ఆద్మీ పార్టీతో పాటు పలు పార్టీలకు పిలుపు వచ్చింది. ఈ మధ్య ప్రధాని మోడీ ప్రతిష్ట బాగా పడిపోయిందని భావిస్తోన్న నేతలు.. బీజేపీని ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఇప్పటికే శివసేన నేత సంజయ్‌ రాత్‌ ప్రకటించారు. వీళ్లే కాదు.. ప్రాంతీయ పార్టీల నేతలందరితోనూ భేటీ అయ్యేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. మొత్తంగా ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.