Sharad Pawar: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ’’ అత్యంత దారుణంగా ఓడిపోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, శివసేన(ఠాక్రే), శరద్ పవార్(ఎన్సీపీ)లు కేవలం 46 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండే శివసేనల ‘‘మహాయుతి’’ కూటమి 233 స్థానాలను గెలుచుకుంది. ఒక్క బీజేపీనే 132 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి తీవ్ర నిరాశలో ఉంది. ఇలాంటి ఫలితాలు రావడానికి ఎన్నికల్లో అక్రమాలు, ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే తమ అనుమానాలపై ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే, తాజాగా శరద్ పవార్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంఎస్) ద్వారా నమోదైన ఓట్లలో అవకతవకలు జరిగాయని శరద్ పవార్ ఆరోపించారు.
Read Also: Safety Tips: గీజర్‌ను సరిగ్గా వాడకపోతే ప్రాణానికే ప్రమాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..?
‘‘ఈవీఎంల ఓట్లలో కొంత వ్యత్యాసం ఉంది, కానీ ప్రస్తుతానికి దీనికి సంబంధించి నా వద్ద ఎటువంటి రుజువు లేదు, కొంతమంది రీకౌంటింగ్ కోరారు, ఈ విషయంలో ఏది సాధ్యమైతే అది చేస్తాను. కొంతమంది రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఏం జరుగుతుందో చూద్ధాం, కానీ దీని గురించి నాకు పెద్దగా ఆశ లేదు’’ అన్నారు.’’ అని అన్నారు. ‘‘ఇది మొదటిసారి జరిగింది. దేశంలో జరిగిన ఎన్నికలు ప్రజల్ని చాలా అశాంతికి గురిచేశాయి. ప్రజల్లో నిరాశ ఉంది’’అని కేంద్రాన్ని విమర్శి్ంచారు.
ప్రతిపక్ష నేతలు పార్లమెంట్‌లో అడిగే ప్రశ్నలను పట్టించుకోవడం లేదని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా పాటించడం లేదని దీనివల్ల స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మంచిది కాదని, ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కాంగ్రెస్ ఆరోపణల్ని కొట్టిపారేసింది. చర్చల కోసం కాంగ్రెస్ పార్టీ బృందాన్ని డిసెంబర్ 03న ఈసీ ఆహ్వానించింది.