Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ ప్రాంతం ఇటీవల అల్లర్లతో అట్టుడికింది. మాజీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో అక్కడి మహిళా లోకం వీరికి వ్యతిరేకంగా ఎదురుతిరిగింది. వారిని అరెస్ట్ చేయాలని టీఎంసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ కబ్జా, మహిళలపై వేధింపులు, రేషన్ కుంభకోణం, ఈడీ అధికారులపై దాడి ఇలా పలు కేసులో షేక్ షాజహాన్ నిందితుడిగా ఉన్నాడు. 55 రోజుల పాటు పరారీలో ఉన్న ఇతడిని కలకత్తా హైకోర్టు ఆదేశాలు, గవర్నర్ అల్టిమేటంతో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతడి కేసును సీబీఐ విచారిస్తోంది.
ఇదిలా ఉంటే, మహిళలపై అతను ఎలాంటి అఘాయిత్యాలు సాగించేవాడో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తోంది. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ బాధిత మహిళ అతని అరాచకాలను వెల్లడించింది. సందేశ్‌ఖాలీ మహిళలు ఎదుర్కొన్న భయానక విషయాలను వెల్లడించింది. తృణమూల్ జిల్లా పరిషత్ సభ్యుడిగా షాజహాన్ కండబలం, ధనబలంలో ఓ సామ్రాజ్యాన్ని నిర్మించాడని వెల్లడించింది. మహిళలను భౌతికంగా లాగేవాడని, అతని వ్యక్తులు కూడా మహిళ పట్ల అనుచితంగా తాకేవారని, అసభ్యకరంగా తిట్టేవారని బాధితురాలు వెల్లడించింది.
Read Also: MK Stalin: సీఏఏ తర్వాత బీజేపీ టార్గెట్ ఇదే.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..
‘‘షేక్ షాజహాన్ అర్ధరాత్రి మాకు ఫోన్ చేసేవాడు, మేము నిరాకరించినట్లైతే, మమ్మల్ని కొట్టేవాడు. మమ్మల్ని బలవంతంగా టీఎంసీ సమావేశాలకు హాజరుకావలి అని కోరేవాడు. వారి కోసం మేం రకరకాల ఆహారపదార్ధాలు చేసేవాళ్లం. వారు మద్యంతో భోజనం చేసేవారు’’ అని ఆమె చెప్పింది. ‘‘వారు మమ్మల్ని ముట్టుకుని, మా చేతులను లాగేవారు. వారి ప్రవర్తన చూసి భయపడి వెళ్లిపోయాను’’ అని ఆమె మచెప్పింది.
రేషన్ కుంభకోణం కేసులో ఈడీ విచారణకు వెళ్లిన సందర్భంలో షేక్ షాజహాన్ మనుషులు అధికారులపై దాడికి పాల్పడ్డారు. జనవరి 5న ఈ ఘటన జరిగితే, 55 రోజుల పాటు అతను పరారీలో ఉన్నాడు. ఈ కేసుతో పాటు పలు కేసుల్ని సీబీఐ విచారిస్తో్ంది. షేక్ షాజహాన్ సోదరుడితో పాటు ముగ్గురు వ్యక్తులను శనివారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టుల సంఖ్య 15కు చేరింది. అతడిని టీఎంసీ పార్టీ 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది.
