Site icon NTV Telugu

Shahid Afridi: షాహిద్ అఫ్రీది యూట్యూబ్ ఛానెల్‌‌పై నిషేధం..

Shahid Afridi

Shahid Afridi

Shahid Afridi: 26 మందిని బలి తీసుకున్న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. లష్కరే తోయిబా ప్రాక్సీ ఉగ్రసంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. ఇప్పటికే భారత్ దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. ఈ చర్యతో పాకిస్తాన్‌కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. పాక్ 80 శాతం ప్రజలు ఈ సింధు, దాని ఉపనదులపైనే ఆధారపడి ఉన్నారు. ఇక పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది.

Read Also: Revanth Reddy: కార్మిక లోకానికి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం!

ఇదిలా ఉంటే, భారత్‌ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న సోషల్ మీడియా అకౌంట్లతో పాటు పలు యూట్యూబ్ ఛానెళ్లను, కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తాజాగా, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది యూట్యూబ్ ఛానెల్‌ని కూడా కేంద్రం బ్యాన్ చేసింది. భారత సైన్యానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ చర్య వచ్చింది. పాకిస్తాన్ సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రీది మాట్లాడుతూ.. ‘‘ మీకు(భారత్) కాశ్మీర్‌లో 8 లక్షల మంది సైనికులు ఉన్నారు. అయినప్పటికీ ఉగ్రదాడి జరిగిందా..? అంటే మీరు పనికిరాని వారు, మీ ప్రజలకు భద్రత కల్పించలేకపోయారు.’ అని వ్యాఖ్యలు చేశాడు.

ఇదే కాకుండా, జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల్ని సమర్థించే ప్రయత్నం చేశాడు. అఫ్రీది ఛానెల్ భారతదేశంలో అనేక దాడులకు కారణమైన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా కథనాన్ని ప్రచారం చేస్తున్నట్లు కనుగొనబడింది.అయితే, హోం మంత్రిత్వ శాఖ నుంచి అధికారికంగా ధ్రువీకరణ రానన్పటికీ, అఫ్రీది యూట్యూబ్ ఛానెల్ భారత్‌లో ప్రస్తుతం యూజర్లకు అందుబాటులో లేదు. ఛానెల్‌ని యాక్సెస్ చేసినప్పుడు కంటెంట్ అందుబాటులో లేదని సూచించే మెసేజ్ కనిపిస్తోంది. ఇప్పటికే, మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, బాసిత్ అలీల యూట్యూబ్ ఛానెళ్లపై కూడా ఇలాంటి కారణాల వల్లే నిషేధించబడ్డాయి.

Exit mobile version