Vimal Elaichi Ad Row: ‘‘విమల్’’ యాడ్ చిక్కుల్లో బాలీవుడ్ స్టార్స్.. షోకాజ్ నోటీసులు..

  • ‘విమల్ ఎలైచీ’ యాడ్‌లో షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌కు షాక్..
  • పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారని మహారాష్ట్ర FDA నోటీసులు.
  • యాడ్ ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశం.
Vimal Ad

Vimal Ad

Vimal Elaichi Ad Row: ‘‘విమల్’’ యాడ్ వివాదంలో బాలీవుడ్ స్టార్స్ చిక్కుకున్నారు. మహారాష్ట్రలో నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో బాలీవుడు నటులు షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమల్ పాన్ మసాలా సంస్థకు చెందిన ‘‘విమల్ ఇలాయిచీ’’ ప్రకటనలో ముగ్గురు కలిసి నటించారు. ఈ యాడ్ ద్వారా పాన్ మసాలా బ్రాండ్‌కు పరోక్షంగా ప్రచారం చేసే అవకాశం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 15 రోజుల్లో యాడ్‌పై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేయబడ్డాయి.

తుకారం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర ఆహార భద్రత విభాగం జారీ చేసిన తొమ్మిది పేజీల నోటీసులో.. వెంటనే ఈ ప్రచారంలో భాగస్వామ్యాన్ని నిలిపివేయాలని, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి యాడ్‌కు సంబంధించిన ప్రచార కంటెంట్‌ను తొలగించాలని ముగ్గురు నటులను ఆదేశించింది. విమల్ ఇలాయిచీ అనే పదం వినియోగదారులకు విమల్ పాన్ మసాలా బ్రాండ్‌తో సంబంధాన్ని ఏర్పరిచేలా ఉందని అధికారులు భావిస్తున్నారు.

మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపై నిషేధం అమల్లో ఉందని FDA పేర్కొంది.ఈ కేసులో నటుల నుంచి వారి ఎండార్స్‌మెంట్ ఒప్పందాల పూర్తి వివరాలు, ప్రచార ప్రణాళికలు, చెల్లింపుల వివరాలు, వారు తమ స్థాయిలో చేసిన డ్యూ డిలిజెన్స్‌కు సంబంధించిన ఆధారాలను కూడా కోరింది. తప్పుదారి పట్టించే ఎండార్స్మెంట్లకు రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదే కాకుండా సంబంధిత వ్యక్తులు మూడేళ్ల పాటు ప్రోడక్ట్‌ల ప్రకటనలకు ఎండార్స్మెంట్ ఇవ్వకుండా నిషేధించే అవకాశం ఉందని నోటీసులు పేర్కొన్నాయి.