Site icon NTV Telugu

Bangladesh: పాకిస్తాన్‌తో పెరుగుతున్న బంగ్లాదేశ్ స్నేహం..

Muhammad Yunus , Shehbaz Sharif

Muhammad Yunus , Shehbaz Sharif

Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, బంగ్లాదేశ్‌కి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ పాలన పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ చేసిన దురాగతాలను మరిచిపోయి స్నేహహస్తం అందిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ నాయకుడు మహ్మద్ యూనస్ గురువారం మాట్లాడుతూ.. తాను పాకిస్తాన్‌తో సంబంధాల బలోపేతానికి అంగీకరించానని చెప్పారు. ఈ పరిణామం భారత్‌కి ఇబ్బందికలిగించేలా మారింది.

Read Also: TG Assembly: భూభారతి బిల్లుపై చర్చను అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం

పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకప్పుడు ఒకే దేశంగా ఉండేవి. 1971లో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన భారత్‌పైనే ఇప్పుడు అక్కడి ప్రభుత్వంతో పాటు మతోన్మాద సంస్థలు తమ అక్కసును వెళ్లగక్కుతున్నాయి. ఈజిప్టులో జరిగిన ఒక సదస్సులో భాగంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ని మహ్మద్ యూనస్ కలిశారు. 1971లో యుద్ధం వల్ల ఏర్పడిన మనోవేదనను పరిష్కరించాలని యూనస్ కోరారు. ‘‘సమస్యలు పదే పదే వస్తూనే ఉన్నాయి, మనం ముందుకు సాగడానికి ఆ సమస్యల్ని పరిస్కరించుకుందాం’’ అని యూనస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

మహ్మద్ యూనస్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని షహబాజ్ షరీఫ్ చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు నిబద్ధతతో ఉన్నామని అన్నారు. ఇటీవల పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్‌కి దశాబ్ధాల తర్వాత ఒక కంటైనర్ షిప్ వెళ్లింది. పాకిస్తాన్ జాతీయులకు వీసా నిబంధనలను సడలిస్తూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే రోజురోజుకు రెండు దేశాల మధ్య స్నేహం బలపడుతూ ఉందని తెలుస్తోంది.

Exit mobile version