NTV Telugu Site icon

Brijendra Singh: హర్యానాలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ బ్రిజేంద్ర సింగ్..

Brijendra Singh

Brijendra Singh

Brijendra Singh: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీకి షాక్ తగిలింది. హర్యానాలో హిసార్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బ్రిజేంద్ర సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. తాను రాజీనమా చేసిన విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘ నేను బలవంతపు రాజకీయ కారణాల వల్ల బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. హిసార్ ఎంపీగా తనకు అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు శ్రీ. JP నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు.

లోక్‌సభ ఎన్నికల ముందు బ్రిజేంద్ర సింగ్, తన తండ్రి బీరేందర్ సింగ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాల నడుమ ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన విషయం బయటకు వచ్చిన వెంటనే ఆయన ఖర్గే నివాసంలో కనిపించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. రాజస్థాన్ చురు నుంచి మరో బీజేపీ ఎంపీ రాహుల్ కస్వాన్ కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి బాంబుదాడి.. పెషావర్‌లో ఘటన..

1972లో జన్మించిన బ్రిజేంద్ర సింగ్, బీజేపీ నాయకుడిగా, హిసార్ ఎంపీగా ఉన్నారు. జాట్ కమ్యూనిటీకి చెందిన ఈయన మాజీ కేంద్ర ఉక్కు మంత్రి బీరేందర్ సింగ్ కుమారుడు. ప్రముఖ జాట్ నాయకుడు ఛోటూ రామ్ మనిమనవడు. ఆయన తల్లి ప్రేమలతా సింగ్ గతంలో హర్యానా అసెంబ్లీలో ఉచన కలాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఎంపీగా ఉన్న బ్రిజేంద్ర సింగ్ గతంలో పలు పార్లమెంట్ కమిటీల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. రాజకీయాల్లోకి రాక ముందు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. 1998 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆల్ ఇండియా లెవల్‌లో 9వ ర్యాంక్ సాధించారు.

రాజకీయ, సైద్ధాంతిక విభేదాల కారనంగా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు, రైతులు, అగ్నివీర్, రెజ్లర్ల నిరస వరకు అనేక విషయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, కాంగ్రెస్ కుటుంబంలో చేరడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, దీపక్ బబారియాలు ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. హిస్సార్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. 2014లో కాంగ్రెస్ సుంచి బ్రిజేంద్ర బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుడు దుష్యంత్ చౌతాలా మరియు అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న భవ్య బిష్ణోయ్‌లను ఓడించి హిసార్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకున్నారు.