గత వారం ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య కీలక సంభాషణ జరిగిందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో గోర్ పాల్గొని ప్రసంగించారు. మోడీ-ట్రంప్‌ల మధ్య ఇటీవల జరిగిన సంభాషణ అనంతరం రెండు దేశాల మధ్య మరిన్ని పరిణామాలు చోటుచేసుకోనున్నాయని చెప్పారు. ‘‘తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే వేచి చూడండి’’ అంటూ ఆసక్తి రేకెత్తించారు. రక్షణ, ఐటీ, ఆరోగ్య సంరక్షణ రంగాలలో సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవలి సైనిక సహకారాన్ని ప్రస్తావిస్తూ.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వైమానిక దళ కేంద్రంలో జరిగిన ‘తరంగ్ శక్తి విన్యాసాల’ సందర్భంగా 500 మందికి పైగా సిబ్బంది పాల్గొన్న సంయుక్త విన్యాసాలను గుర్తుచేశారు. రాష్ట్రంలో జరిగిన కార్యకలాపాల్లో అమెరికన్ ఎఫ్-35 యుద్ధ విమానాలు పాల్గొనడాన్ని కూడా ప్రముఖంగా పేర్కొన్నారు. ఇక అమెరికా-భారత్ సంబంధాల్లో కోల్‌కతా ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. 1792లో మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ బెంజమిన్ జాయ్‌ను ఈ నగరానికి మొదటి యూఎస్ కాన్సుల్‌గా నియమించారని గుర్తుచేసుకున్నారు.
అయితే మోడీ-ట్రంప్ మధ్య జరిగిన తాజా ఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలను వెల్లడించకపోయినప్పటికీ.. రాబోయే రోజుల్లో భారత్–అమెరికా సంబంధాల్లో మరిన్ని పరిణామాలు ఉండవచ్చని సూచించారు. అయితే తదుపరి ఏ అంశంపై నిర్ణయాలు వెలువడనున్నాయన్న దానిపై కూడా స్పష్టత ఇవ్వలేదు. అలాగే అమెరికాకు జనరిక్ ఔషధాలను సరఫరా చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. భారత ఔషధ పరిశ్రమపై అమెరికాకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. రక్షణ, సాంకేతికత, తయారీ, ఆరోగ్య రంగాలు సహా అనేక విభాగాల్లో ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ అగర్వాల్ హాజరయ్యారు.
దుర్గా పూజలో రాయబారి
ఇక కార్యక్రమానికి ముందు సెర్గియో గోర్ కోల్‌కతాలోని దుర్గా పూజ మండపాలను సందర్శించారు. పండుగలో కనిపించే సృజనాత్మకత, సామూహిక భాగస్వామ్యం, ప్రజల ఆత్మీయతను ప్రశంసించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
Great to be back in Kolkata! Visited some beautiful pandals and experienced firsthand the incredible creativity, community spirit, and warmth. I can see why this celebration is so special. Happy Durga Puja to everyone celebrating! https://t.co/PsX4imUqhD
— Ambassador Sergio Gor (@USAmbIndia) October 12, 2026

