దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్ అభ్యర్థులను ప్రకటించేసింది. అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను దర్శనం చేసుకుంటున్నారు. కొత్త పథకాలు గురించి ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతున్నారు. మరోసారి అధికారం కోసం ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా కొత్త కొత్త పథకాలు ప్రకటించుకుంటూ పోతున్నారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన ప్రజల నుంచి సాయం కోరారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హస్తినలోని జంగ్‌పుర అసెంబ్లీ స్థానం నుంచి సిసోడియా బరిలోకి దిగుతున్నారు. అయితే పోటీలో గెలిచేందుకు ఆర్థిక సాయం కోసం ప్రజల మద్దతు కోరారు. ఈ మేరకు ఆయన ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. తనకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ఎన్నికల బరిలోకి దిగాను. ఇప్పటి దాకా మీ మద్దతుతో గెలిచా. మీరు అందించే సాయంతో ఢిల్లీలో ఉద్యోగం, విద్యా పురోగతికి ఉపయోగపడుతుంది.’’ అని సిసోడియా పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది జైలుకెళ్లారు. 17 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ప్రస్తుతం పట్పర్‌గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇటీవల యూపీఎస్సీ కోచింగ్ నిపుణుడు అవధ్ ఓజా ఆప్‌లో చేరాడు. దీంతో పట్పర్‌గంజ్ నియోజకవర్గాన్ని అవధ్ ఓజాకు త్యాగం చేశారు. దీంతో సిసోడియా జంగ్‌పుర స్థానానికి మారారు.