Article 370: జమ్మూకాశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక అధికరణ ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఈ అంశాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు అక్రమం అంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సోమవారం రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసే పనిలో ఉన్నారు అధికారులు.
సుప్రీం తీర్పుకు ముందు లా అండర్ ఆర్డర్ గురించి చర్చించేందుకు పోలీసులు, అడ్మినిస్ట్రేషన్, ఇతర ఉన్నతాధికారులు శుక్రవారం శ్రీనగర్‌లో సమావేశమయ్యారు. జమ్మూకాశ్మీర్ పోలీస్ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఎవరైనా దుష్ప్రవర్తనకు పాల్పడినా, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిషనల్ డీజీపీ(లా అండర్ ఆర్డర్) విజయ్ కుమార్, కాశ్మీర్‌లోని కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన మీటింగ్‌కి అధ్యక్షత వహించారు. ఆర్టికల్ 370 కేసులో సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశాలు అందాయి.