NTV Telugu Site icon

Tamil Nadu: “స్కంధమలై”ని “సికిందర్ మలై”గా మార్చాలి.. కుమారస్వామి ఆలయంపై వివాదం..

Thiruparankundram

Thiruparankundram

Tamil Nadu: తమిళనాడులో మధురై సమీపంలోని కుమారస్వామి దేవాలయం ఉన్న తిరుపరంకుండ్రంపై వివాదం చెలరేగింది. తమిళులు ఎంతో భక్తిగా పూజించే సుబ్రమణ్య స్వామి కొలువుదీరిన కొండని కొందరు ముస్లింలు అపవిత్రం చేశారని హిందూ సంఘాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంల అంతటా పోలీసులు 144 సెక్షన్ విధించారు. మధురై జిల్లాలో మంగళవారం భద్రతను కట్టుదిట్టం చేశారు. హిందూ వ్యతిరేక సమూహాలు, రాష్ట్రం ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు భారీ నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేస్తున్న సందర్భంలో ఈ పరిణామాలు ఏర్పడ్డాయి.

Read Also: Health Tips: ఫీవర్‌తో ఉన్నప్పుడు ఇలా చేస్తున్నారా?.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?

తిరపరంకుండ్రం కొండను భక్తులు ‘‘స్కంధమలై’’గా పిలుస్తారు. ఈ కొండ పేరుని ‘‘సికిందర్‌మలై’’గా మార్చాలంటూ కొన్ని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తుండటంతో వివాదం ప్రారంభమైంది. తిరుపరంకుండ్రం కొండపై కొందరు వ్యక్తులు మాంసాహారం తీసుకున్నట్లుగా చూపిస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో హిందవులు, కుమారస్వామి భక్తుల్లో తీవ్రం ఆగ్రహావేశాలు చెలరేగాయి. ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్నా కూడా డీఎంకే ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుందని హిందూ సంఘాలతో పాటు భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ కొండపై ఒక దర్గా కూడా ఉంది. ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లినందున హిందూమున్నాని అనే సంస్థ నిరసనలకు ప్లాన్ చేసింది. అధికారులు వారికి అనుమతి నిరాకరించినప్పటికీ, నిరసన చేయాలని భావిస్తున్నారు.

మధురై అంతటా శాంతిభద్రతల ఆందోళనలను పేర్కొంటూ అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. గుడి, దర్గా రెండింటిలోనూ భక్తులను దర్శనం చేసుకోకుండా పోలీసులు కొండ ప్రవేశద్వారం వద్ద బారికేడ్లు వేశారు. తేని జిల్లాలసమీపంలోని అండిపట్టి కనవై, ఉసిలం పట్టి తేవర్ విగ్రహ ప్రాంతం, , దిండిగల్ జిల్లా సరిహద్దుకు సమీపంలోని ఉత్తప్పనాయకనూర్, ఎలుమలై జంక్షన్ వంటి కీలక తనిఖీ కేంద్రాల వద్ద కఠినమైన వాహన తనిఖీలు జరిగాయి.

తిరుప్పూర్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. నిరసన కోసం మధురై చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న హిందూ అనుకూల వర్గాలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై , అధికార డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ఆయన ఆరోపించారు. సెక్షన్ 144 ఉన్నప్పటికీ మధురైలో ఒక డీఎంకే నాయకుడు ర్యాలీని ఎలా నిర్వహించారని అన్నామలై ప్రశ్నించారు.