Site icon NTV Telugu

Karnataka: హుబ్లీలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌పై అల్లరి మూకల దాడి

Hubli Police Station

Hubli Police Station

కర్ణాటకలోని హుబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వాట్సాప్ స్టేటస్ కారణంగా అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా అభ్యంతరకర రీతిలో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో అల్లరి మూకలు ఏకంగా పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ సమయంలో ఇన్‌స్పెక్టర్ సహా పోలీసులు అక్కడే ఉన్నారు. వారు ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.

పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనలో ఇన్‌స్పెక్టర్ సహా నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేసి ఉంచిన వాహనాలను సైతం దుండగులు ధ్వంసం చేశారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీఛార్జ్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే హుబ్లీ పోలీస్ కమిషనర్ లభు రామ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హుబ్లీ నగర వ్యాప్తంగా 144 సెక్షన్‌ను విధించారు. కాగా హుబ్లీ ఓల్డ్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉన్న హనుమాన్ ఆలయంపైనా రాళ్లదాడి సంభవించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. అటు ఢిల్లీలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా కొందరు రాళ్ల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

New Delhi: 25 ఏళ్ల తర్వాత మళ్లీ అదే థియేటర్‌లో అగ్నిప్రమాదం

Exit mobile version