Influenza A(H3N2) Cases: దేశవ్యాప్తంగా సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ వేగంగా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ లక్షణాలతో ఈ వైరస్ విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీర్ఘకాలిక దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వైరస్ కారణంగా దేశంలో 2 మరణాలు సంభవించాయి. ‘‘హాంకాంగ్ ఫ్లూ’’గా పిలిచే హెచ్3ఎన్2 వైరస్ వల్ల దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఇదిలా ఉంటే మార్చి చివర నాటికి సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా కేసులు తగ్గుతాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదు అవుతున్న సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా కేసుల పరిస్థితిని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్(ఐడీఎస్పీ) ద్వారా పరిశీలస్తున్నట్లు వెల్లడించింది. మార్చి చివరినాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వైరస్ చిన్న పిల్లలు, వృద్ధుల్లో ప్రాణాంతకంగా మారుతోందని, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వల్ల ఇద్దరు మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలోని హసన్‌లో 82 ఏళ్ల వృద్ధుడు దేశంలోనే హెచ్3ఎన్2తో మరణించిన మొదటి వ్యక్తిగా భావిస్తున్నారు.
Read Also: CM KCR : ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్
దేశంలో ఇప్పటి వరకు 90 హెచ్2ఎన్2 వైరస్ కేసులు నమోదు అయ్యాయని, ఎనిమిది హెచ్1ఎన్1 వైరస్ కేసులు కనుక్కున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇన్‌ఫ్లూయెంజా ఏ వైరస్ రకంలో ఉపరకంగా హెచ్3ఎన్2 వైరస్ ఉంది. దీని వల్ల శ్వాసకోశ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. జనవరి నుంచి మార్చి వరకు అంటే రుతుపవన అనంతర కాలం సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా ప్రబులుతుంది. మార్చి నెలఖరుకు తగ్గుముఖం పడుతుందని కే్ంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రీట్మెంట్ ప్రోటోకాల్, వెంటిలేటరీ నిర్వహణపై ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. హెచ్1ఎన్1 కేసులతో వ్యవహరించే ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.
హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 రెండూ కూడా కోవిడ్ తరహా లక్షలణాలను కలిగి ఉంటాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సోకింది. ప్రపంచవ్యాప్తంగా 6.8 మిలియన్ల మరణాలకు కారణం అయింది. నిరంతర దగ్గు, జ్వరం, చలి, ఊపిరి ఆడకపోవడం మరియు శ్వాసలో గురక వంటి లక్షణాలు ఉంటాయి. రోగులు వికారం, గొంతు నొప్పి, శరీర నొప్పి మరియు విరేచనాల వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు దాదాపు ఒక వారం పాటు కొనసాగవచ్చు.