Tamil Nadu: లోక్‌సభ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తమిళనాడులో అధికార డీఎంకే వర్సెస్ బీజేపీలా రాజకీయం నడుస్తోంది. ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాట బీజేపీ టార్గెట్‌గా పోస్టర్ల ప్రచారం జరుగుతోంది. మోడీ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా పలు చోట్ల ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ‘స్కాన్ చేసి స్కామ్‌లని చూడండి’ అంటూ పోస్టర్లపై రాసి ఉంది. ‘‘జీ పే’’ ని ప్రధాని ఫోటో మరియు క్యూఆర్ కోడ్ ఉంది.
Read Also: AP Elections 2024: ఎన్నికల వేళ ఏపీలో భారీగా పట్టుబడుతున్న మద్యం, డబ్బు, గంజాయి..
ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంతో మొబైల్ ఫోన్‌లో ఓ వీడియో ప్రత్యక్షమవుతోంది. ఎలక్టోరల్ బాండ్లు, కాగ్ నివేదికలో పేర్కొన్న అక్రమాలు, మౌళిక సదుపాయాల ప్రాజెక్టు్ల్లో అవినీతి మొదలైన వాటి గురించి వీడియో వివరిస్తోంది. బడా కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణాలు రద్దు చేశారని పేర్కొంది. బీజేపీని తిరస్కరించి ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను వీడియోలో కొరడం గమనించవచ్చు.
అయితే, ఈ పోస్టర్లను డీఎంకేనే అంటించిందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై ఆ పార్టీ స్పందించలేదు. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
