SC grants Centre two more weeks to file response on pleas challenging Places of Worship Act 1991: ప్రార్థనా స్థలాల చట్టం-1991లోని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు కేంద్రానికి మరో రెండు వారాలు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 31 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. నవంబర్ 14న విచారణను వాయిదా వేసింది. 1991 ప్రార్థన స్థలాల చట్టంలోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా పలువురు వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నేతృత్వంలోని న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, రవీంద్ర ఎస్ భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రార్థన స్థలాల చట్టంతో పాటు దీనికి వ్యతిరేకంగా జమియత్ ఉలామా-ఇ-హింద్ దాఖలు చేసిన అన్ని పిటిషన్లను అనుమతించింది. 1991 చట్టం ప్రకారం ఆగస్టు 15,1947న ఉన్న ప్రార్థనా స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కానీ, దాని స్వభావాన్ని మార్చడానికి కానీ అనుమతించదు. దీనిపై దావా వేయడాన్ని ఈ చట్టం నిషేధించింది. విదేశీ దురాక్రమణదారుల చేత అనేక దేవాలయాలు మసీదులుగా మార్చబడ్డాయని.. ఈ చట్టం వల్ల అన్యాయం జరుగుతోందని కొంత మంది వాదిస్తున్నారు.
Read Also: Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ వేర్పాటువాదిపై భారత్ అభ్యర్థనను తిప్పిపంపిన ఇంటర్‌పోల్
హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు దేవాలయాలు ఆక్రమణదారులచే ధ్వంసమయ్యాయని.. ప్రార్థన స్థలాలు, తీర్థయాత్రలను పునరుద్ధరించుకునే హక్కును ఈ చట్టం హరిస్తోందని 1991 చట్టాన్ని సవాల్ చేశారు. కాశీ రాజకుటుంబానికి చెందిన కుమార్తె, మహారాజ కుమారి కృష్ణప్రియ, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, చింతామణి మాలవ్య, న్యాయవాదులు చంద్రశేఖర్, రుద్ర విక్రమ్ సింగ్, వారణాసి నివాసి స్వామీ జీతేంద్రానంద సరస్వతి, మథుర నివాసి దేవకీనందన్ ఠాకూర్ మరికొంత మంది మతగురువులు 1991 చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు లో పిటిషన్లు దాఖలు చేశారు.
దీనికి ముందు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు గత ఏడాది మార్చి 12 కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు విచారణ చేపడితే దేశంలోని చాలా మసీదులపై వ్యాజ్యాలు దాఖలు అవుతాయని.. ఈ పిటిషన్ విచారణను సవాల్ చేస్తూ జమియత్ ఉలామా-ఇ-హింద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1991 చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలు అయిన పిటిషన్ ను వ్యతిరేకిస్తూ భారత ముస్లిం పర్సనల్ లాబోర్డు కూడా సుప్రీంను ఆశ్రయించింది.
ప్రస్తుతం దేశంలో జ్ఞానవాపి మసీదులో పాటు మథుర శ్రీకృష్ణ జన్మభూమి కేసుతో పాటు కర్ణాటకలోని పలు మసీదులు కూడా హిందూ ఆలయాలను కూల్చి నిర్మించినవే అనే వివాదం సాగుతోంది. అయితే వీటన్నింటికి 1991 ప్రార్థనా స్థలాల చట్టం అడ్డుగా నిలుస్తుందని పలువురు ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు.