Sanjay Raut: నాగ్‌పూర్ పేరును దీక్షాభూమిగా మార్చాలి.. ఉద్ధవ్ టీమ్ సంచలన డిమాండ్

  • మహారాష్ట్రలో పేరు మార్పు వివాదం..
  • దాదార్ మెట్రో స్టేషన్ పేరు చైత్యభూమిగా మారుస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన..
  • నాగ్‌పూర్ పేరు దీక్షాభూమిగా మార్చాలని శివసేన(యూబీటీ) డిమాండ్..
Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut:  మహారాష్ట్రలో ‘‘పేరు మార్పు’’ అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది. ముంబైలోని దాదర్ మెట్రో స్టేషన్ పేరును ‘‘చైత్యభూమి’’గా ప్రభుత్వం మార్చాలని భావించింది. అయితే, ఇదే సమయంలో నాగ్‌పూర్ పేరును ‘‘దీక్షాభూమి’’గా మార్చాలని ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. దాదార్ కేవలం ఒక మెట్రో స్టేషన్ మాత్రమేనని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అందించే గొప్ప గౌరవం నాగ్‌పూర్ పేరును దీక్షా భూమిగా మార్చడమే అని అన్నారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపాదిక తీసుకురావాలని, దీనికి తాము మద్దతు ఇస్తామని చెప్పారు. అంబేద్కర్ జీవితంలో సామాజిక విప్లవం నాగ్‌పూర్ నుంచే ప్రారంభమైందని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ రౌత్ డిమాండ్‌కు మద్దతు తెలిపారు. నాగ్‌పూర్ పేరు మార్చడంలో అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు.

దీనికి ముందు, దాదార్ మెట్రో స్టేషన్ పేరు చైత్యభూమిగా మారుస్తామని సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. 1956 డిసెంబర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మరణించిన అనంతరం ముంబైలోని దాదర్ ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆ ప్రాంతంలోనే చైత్యభూమి ఉంది. అంబేడ్కర్ స్మారక స్థలంగా చైత్యభూమికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

సంజయ్ రౌత్ డిమాండ్‌పై బీజేపీ స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి నవనాథ్ బాన్ మాట్లాడుతూ.. ముందుగా దాదర్ పేరు చైత్యభూమిగా మార్చే నిర్ణయాన్ని రౌత్ స్వాగతించాలని అన్నారు. ఈ అంశాన్ని శివసేన(యూబీటీ) మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)లు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. సంజయ్ రౌత్ ఎప్పుడూ చైత్యభూమికి వెళ్లరని, అంబేద్కర్ ఆలోచనల్ని కూడా ప్రచారం చేయరని విమర్శించారు.