BJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ‘‘జెన్-జీ’’ కాదు.. తిరంగాతో సానుభూతి యత్నం!

  • సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ కస్టడీపై బీజేపీ నేత సంబిత్ పాత్ర వ్యాఖ్యలు..
  • జాతీయ జెండాను అడ్డుపెట్టుకుని సానుభూతి పొందే ప్రయత్నం..
  • జాతీయ జెండాను ఎగరేసినందుకు కాదు, శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకే జైలు..
  • రాంకా, దాస్‌లో జెన్-జీ కాదు..
Sambit Patra

Sambit Patra

BJP:  కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌ను జాతీయ జెండా ఎగరేసినందుకు పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదని, గతంలో వారు సంతకం చేసిన ‘‘శాంతి ఒప్పందాన్ని’’ ఉల్లంఘించినందుకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. భువనేశ్వర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీజేపీ నేతలు తిరంగాను ఎగరేయకుండా అడ్డుకున్నారనే తప్పుడు కథనాన్ని ప్రచారం చేసేందుకు కొంత మంది పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జాతీయ జెండాను ఎగరేయడాన్ని అడ్డుకుందని, నియంతృత్వంగా వ్యవహరిస్తోందనే తప్పుడు అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ల వయసు 27,31 ఏళ్లని, వీరు జెన్-జీ కాదని ఆయన అన్నారు. ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణలో ఇద్దరి గుర్తింపు, వయసు అంశాలపై న్యాయమూర్తి ప్రశ్నలు లెవనెత్తారని తెలిపారు. వీరిద్దరిని అక్టోబర్ 10న మొదట అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనమని ‘‘పీస్ బాండ్’’పై సంతకం చేసి విడుదలయ్యారని సంబిత్ పాత్ర చెప్పారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే బాండ్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఆయన ఆరోపించారు.

తిరంగా పేరుతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఒక పథకం ప్రకారం ముందస్తు ప్రణాళికతో నడిపిస్తున్నారని ఆరోపించారు. జాతీయ జెండాను అడ్డుపెట్టుకుని అశాంతిని ప్రేరేపిస్తే చట్టపరమైన రక్షణ ఉండదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం బలహీనంగా ఉండే దేశాల్లో జరుగుతున్న తరహాలో భారత్‌లో అశాంతిని సృష్టించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.