Site icon NTV Telugu

Saji Cheriyan: రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి పదవి ఊడింది..

Saji Cheriyan

Saji Cheriyan

భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మంత్రి పదవి ఊడిపోయింది.. కేరళ మత్స్యకార​, సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్.. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.. చెరియన్​ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు.. అతడిని కేబినెట్‌ నుంచి తొలగించాలంటూ డిమాండ్‌ చేశాయి.. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.. ఇక, మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. రాష్ట్ర గవర్నర్‌తో పాటు సీఎం పినరయి విజయన్‌ కూడా వివరణ కోరిన విషయం తెలిసిందే కాగా.. తన వ్యాఖ్యాలు వివాదానికి కారణం కావడంతో.. ఇవాళ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు సాజీ చెరియన్.

Read Also: BJP: ఎవరినీ వదులుకోవద్దు.. చేరికలపై బీజేపీ హైకమాండ్‌ కీలక ఆదేశాలు

కేరళలో రాజ్యాంగంపై తను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో.. ఒక రోజు తర్వాత సాజీ చెరియన్ బుధవారం కేరళ సాంస్కృతిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. “నేను రాజీనామా చేశాను, అది నా వ్యక్తిగత నిర్ణయం.. నేనెప్పుడూ రాజ్యాంగాన్ని కించపరచలేదు.. సీపీఐ-ఎం, ఎల్‌డీఎఫ్‌లను బలహీనపరిచేందుకు ప్రసంగంలోని కొంత భాగాన్ని తీసుకుని వివాదం సృష్టించారని తన ప్రకటనలో పేర్కొన్నారు చెరియన్.. కాగా, మల్లపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చెరియన్.. అక్కడ ప్రసంగిస్తూ.. కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనుమతించదు.. కానీ, వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందంటూ వ్యాఖ్యానించారు.. దీంతోనే దేశంలో కార్పొరేట్ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని పేర్కొన్న ఆయన.. బ్రిటీష్ వారు సంకలనం చేసిన రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని.. దానినే 75 ఏళ్లుగా అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటివి వాటిలో పొందుపరిచారని.. ఎవరు దీనికి విరుద్ధంగా చెప్పినా తాను అంగీకరించబోనని చెరియన్‌ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే..

అయితే, కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి చెరియన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. కేరళలోనే లెఫ్ట్‌ సర్కార్‌పై కూడా విమర్శలు పెరిగాయి.. చెరియన్ వ్యాఖ్యలను ‘అసహ్యకరమైనవి’గా కాంగ్రెస్‌ అభివర్ణించగా, అతను రాజ్యాంగాన్ని అగౌరవపరిచాడు అంటూ బీజేపీ మండిపడింది.. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడం.. గవర్నర్‌, సీఎం, పార్టీ నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో.. చివరకు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు సాజీ చెరియన్.

Exit mobile version