Ajit Pawar: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై గురువారం తెల్లవారుజామున దాడి జరిగింది. ఇంట్లో దొంగతానికి వచ్చిన దుండగుడు సైఫ్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే, ఈ రోజు థానేలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, ఈ ఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడని, అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిస్తున్నా అనే విషయం తెలియదని చెప్పారు. నిందితుడి ప్రధాన ఉద్దేశం దొంగతనం చేయడమని, దాడి చేయడం కాదని స్పష్టం చేశారు. ‘‘నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత ముంబైలో శాంతిభద్రతలు కుప్పకూలాయని కొందరు ప్రతిపక్ష నాయకులు పేర్కొన్నారు. అయితే, వాస్తవాలు మరోలా కనిపిస్తున్నాయి. నిందితుడు బంగ్లాదేశ్ నుండి వచ్చాడు, మొదట కోల్‌కతాకు వచ్చి, ఆ తర్వాత ముంబైకి ప్రయాణించాడు. తాను దొంగతనం చేయబోతున్న ఇళ్లు సైఫ్ అలీ ఖాన్‌ది అని నిందితుడికి తెలియదు’’ అని అన్నారు.
Read Also: Trump Trip To India: భారత పర్యటనపై ట్రంప్ ఆసక్తి.. సలహాదారులతో చర్చ..
జనవరి 16 తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు దాడి చేసిన ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ముంబై సురక్షితంగా లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ వంటి నేతలు మహాయుతి సర్కార్‌ని విమర్శించారు. దీనిపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఒక సంఘటన ఆధారంగా ముంబై సురక్షితంగా లేదనే ముద్ర వేయడం సరికాదని అన్నారు. మెగాసిటీలలో ముంబై అత్యంత సురక్షితమైనదని ఫడ్నవీస్ అన్నారు. నిందితుడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ని ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసి బంద్రా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 5 రోజుల కస్టడీకి అప్పగించింది.