Sabarimala: కేరళ ప్రభుత్వం శబరిమలకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మండలం- మకరవిలక్కు యాత్రా సీజన్‌లో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఉచిత బీమా కల్పించనుంది. ఆలయ నిర్వహణను పర్యవేక్షించే ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ తెలిపారు. ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే యాత్రా సీజన్‌లో స్వామి వారి దర్శనం సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రమాదవశాత్తు మరణించే భక్తులను వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను టీడీబీ చేస్తుందని చెప్పుకొచ్చారు.
Read Also: Israel–Hezbollah conflict: హెజ్బొల్లా టాప్ కమాండర్ను లేపేసిన ఇజ్రాయెల్
కాగా, గత ఏడాది యాత్రా సీజన్‌లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ ఏడాది శబరిమల యాత్రా సీజన్ లో 13,600 మంది పోలీసులు, 2,500 ఫైర్, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించనున్నారు. అలాగే, టీడీబీ రైల్వే స్టేషన్ల దగ్గర అదనపు పోలీస్ సిబ్బందిని, అటవీ శాఖ 132 సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1500 ఎకో గార్డ్స్ శబరిమలకు వచ్చే భక్తులకు సహాయం చేయనున్నారు. వీటితో పాటు ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కొన్ని రోజుల కిందట పౌర విమానయాన శాఖ రూల్స్ సడలించింది. సెక్యూరిటీ స్కానింగ్ తర్వాత అయ్యప్ప భక్తులు ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణించే ఛాన్స్ కల్పించింది.