Saayoni Ghosh: పార్లమెంట్‌ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం

  • పార్లమెంట్ సజావుగా సాగనివ్వండి
  • రెబల్ టీఎంసీ ఎంపీ సాయోని ఘోష్ విజ్ఞప్తి
  • అసెంబ్లీ ఎన్నికల తర్వాత తిరుగుబావుటా ఎగరేసిన ఎంపీ
Saayoni Ghosh

Saayoni Ghosh

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకుండా ప్రతిరోజూ అంతరాయం ఏర్పడుతుండటంపై రెబల్ టీఎంసీ ఎంపీ సాయోని ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడారు. సభలో నిరంతరం గందరగోళం కొనసాగడం వల్ల ప్రజల పన్నుల సొమ్ము వృథా అవుతోందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌లో ప్రస్తావించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలను లక్ష్యంగా చేసుకుని ఇండియా కూటమి నిర్వహించిన నిరసన ప్రదర్శనను విమర్శించారు.

‘‘పార్లమెంట్ సజావుగా పనిచేయడం లేదు. ప్రతిరోజూ సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా అవుతోంది. ప్రశ్నోత్తరాల సమయమైనా, జీరో అవర్ అయినా.. మా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించలేకపోతున్నాం. ఇది నిజంగా చాలా దురదృష్టకరం’’ అని ఆమె అన్నారు. తమ ప్రాంతాలకు సంబంధించిన అంశాలపై ప్రజలు ఎంపీలపై ఎంతో ఆశలు పెట్టుకుంటారని సాయోని ఘోష్ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆశిస్తారని తెలిపారు.

‘‘నా ఒక్కటే విజ్ఞప్తి.. పార్లమెంట్‌ను సజావుగా నడవనివ్వండి. సభ వెలుపల మీకు నచ్చిన విధంగా నిరసనలు చేయండి. కానీ సభ లోపల పార్లమెంట్ సక్రమంగా సాగేందుకు అధికార పక్షానికి బాధ్యత ఉంది. అదే సమయంలో ప్రతిపక్షం కూడా తన బాధ్యతను నిర్వర్తించాలి’’ అని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలా సహకరించాలని సాయోని ఘోష్ కోరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత పలువురు ఎంపీలు తిరుగుబావుటా ఎగరేశారు.