S Jaishankar: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు అంతర్జాతీయ సంస్థలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆమేస్టి ఇంటర్నేషనల్, యూఎన్ హక్కుల సంస్థలు దీనిని సీఏఏని తప్పుగా భావిస్తున్నారు. వీరికి అగ్రరాజ్యం అమెరికా జతకలిసింది. సీఏఏపై ఆందోళన చెందుతున్నామని, ఇది ఎలా అమలువుతుందో నిశితంగా గమనిస్తున్నామంటూ కామెంట్స్ చేసింది. పూర్తిగా భారత అంతర్గత విషయమైన సీఏఏపై అమెరికా వ్యాఖ్యానించడాన్ని భారత్ తప్పుబడుతోంది.
ఇదిలా ఉంటే భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారతదేశ చరిత్రపై అతనికి ఉన్న అవగాహనను జైశంకర్ ప్రశ్నించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లో హింసించబడుతున్న ముస్లిమేతర మైనారిటీల కోసం భారత పౌరసత్వం కోసం తీసుకువచ్చిన సీఏఏ గురించి మాట్లాడుతూ.. వారి పట్ల భారత్‌కి బాధ్యత ఉందని జైశంకర్ అన్నారు. విభజన సమయంలో వారంతా అణిచివేతకు గురయ్యారని అన్నారు.
Read Also: Viral News: ‘‘గూగుల్ ఈజ్ రాంగ్’’.. ప్రయాణికుల్ని హెచ్చరించేందుకు సైన్‌బోర్డ్..
సీఏఏ అమలు ఒక రోజు తర్వాత గార్సెట్టి మాట్లాడుతూ.. ‘‘ మీరు స్నేహితులుగా ఎంత సన్నిహితంగా ఉన్నా మన సూత్రాలను వదులుకోము’’ అని అన్నారు. వీటికి ప్రతిగా మంత్రి జైశంకర్ భారత విభజనను వారంతా మరిచిపోయారా.? అని అన్నారు. ‘‘ నేను వారి ప్రజాస్వామ్యంలోని అసంపూర్ణతలను లేదా వారి ప్రజాస్వామ్యాన్ని, వారి సూత్రాలను, వారి లోపాలను ప్రశ్నించడం లేదు. మన చరిత్రపై వారి అవగాహనను నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రపంచంలోనే అనేక ప్రాంతా నుంచి వ్యాఖ్యలను వింటుంటే, ఇది భారతదేశ విభజన జరినట్లు అనిపిస్తుంది. సీఏఏ అమలులో ఎలాంటి సమస్యలు లేవు’’ అని జైశంకర్ అన్నారు. తమ ప్రభుత్వానికి కూడా సూత్రాలు ఉన్నాయని గార్సెట్టికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘‘ మీరు ఓ సమస్యను తసీుకుని, దాని నుంచి చారిత్రక సందర్భాలను తీసేసి, దానిని శానిటైజ్ చేసి, రాజకీయ వాదనలుగా చేసి, నాకు సూత్రాలు ఉన్నాయి, మీకు లేవు అని చెబితే, నాకు సూత్రాలు ఉన్నాయని, విభజన సమయంలో నిరాశకు గురైన ప్రజల పట్టల బాధ్యత ఉందని చెబుతాను’’ అని అన్నారు. అమెరికా సోవియట్ యూనియన్లో అణిచివేతకు గురైన యూదులు, క్రైస్తవుల కోసం జాక్సన్-వానిక్ సవరణ చట్టాలను ఆ దేశానికి జైశంకర్ మరోసారి గుర్తు చేశారు. అమెరికా సీఏఏ తరహా చట్టాలైన లాటెన్ బర్గ్ సవరణ, స్పెక్టర్ సవరణను గురించి గుర్తు చేశారు. కాబట్టి నన్ను అడిగితే ఇతర దేశాలు, ఇతర ప్రజాస్వామ్యాలు, జాతి, విశ్వాసం, సామాజిక లక్షణాల ఆధారంగా చేసిన చట్టాల గురించి చాలా ఉదాహరణలు ఇవ్వగలనని అమెరికాకు జైశంకర్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు.