Site icon NTV Telugu

India-Russia: భారత్‌కు రష్యా Su-57 ఫైటర్ జెట్ ‘‘సోర్స్ కోడ్’’ ఆఫర్.. అంగీకరిస్తే ‘‘ అత్యాధునిక టెక్నాలజీ’’ మన సొంతం..

Su 57

Su 57

India-Russia: యుద్ధ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ పైనే యుద్ధాలు ఆధారపడుతున్నాయి. దీంట్లో భాగంగానే పలు దేశాలు తమ సైన్యంలో ఐదో తరం ఫైటర్ జెట్లు ఉండాలని కోరుకుంటున్నాయి. ప్రస్తుతం 5వ తరం యుద్ధ విమానాలు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సొంతగా తయారు చేసుకున్నాయి. భారత్ కూడా ఈ ఫైటర్ జెట్ డెవలప్మెంట్ పాజెక్టును ప్రారంభించింది.

ఇదిలా ఉంటే, రష్యా నుంచి భారత్ కు బిగ్ ఆఫర్ లభించింది. రష్యా తన ఆధునాతన ఐదో తరం యుద్ధ విమానం Su-57 సోర్స్ కోడ్‌ను భారత్‌కి ఆఫర్ చేసింది. చైనా, పాకిస్తాన్ నుంచి ముప్పును ఎదుర్కొంటున్న భారత్‌కి రష్యా నుంచి వచ్చిన ఈ ఆఫర్ చాలా ప్రయోజనకరమని చెప్పాలి. Su-57E యొక్క సోర్స్ కోడ్‌కు యాక్సెస్ అనేది భారత్ తన ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అభివృద్ధిలో స్వయంప్రతిపత్తికి  కీలకంగా మారే అవకాశం ఉంది. రష్యా యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ చేసిన ఈ ప్రతిపాదన ఇప్పుడు కీలకంగా మారింది. మేకిన్ ఇండియా పోగ్రాం కింద భారత్‌లోనే జెట్స్ తయారీ చేస్తామనే ప్రతిపాదన కూడా చేసినట్లు తెలుస్తోంది.

సోర్స్ కోడ్ చాలా కీలకం:

ఫైటర్ జెట్స్‌తో పాటు ఏదైనా రక్షణ రంగ పరికరానికి, క్షిపణులకు ‘‘సోర్స్ కోడ్’’ అనేది చాలా కీలకం. ఈ సోర్స్ కోడ్ ఫైటర్ జెట్స్‌లకు మెదడు వంటిది. ఆ యుద్ధ విమానం నుంచి పనిచేసే ప్రతీ బాంబు, క్షిపణితో ఈ సోర్స్ కోడ్ లింక్ అయి ఉంటుంది. ఒక ఫైటర్ జెట్ కు అన్ని రకాల ఆయుధాలను బిగించాలంటే సోర్స్ కోడ్ తప్పనిసరిగా తెలిసుండాలి. ఉదాహరణకు భారత్ ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలను కొనుగోలు చేసింది. వీటి ద్వారా స్కాల్ప్ క్షిపణులు, హామర్ వంటి బాంబుల్ని ప్రయోగించవచ్చు. మన స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఆకాష్ వంటి మిస్సైల్స్‌ని ప్రయోగించాలంటే రఫేల్ సోర్స్ కోడ్ అనేది తెలిసి ఉండాలి. అయితే, ఇటీవల పాకిస్తాన్‌తో సంఘర్షణ సమయంలో భారత్ అడిగినప్పటికీ ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇవ్వలేదని తెలుస్తోంది. సోర్స్ కోడ్ తెలిసి ఉంటే స్వదేశీ ఆయుధాలను ఫైటర్ జెట్లకు అనుసంధానం చేయడానికి, దాని వ్యవస్థలను ఇష్టానుసారంగా మార్చడానికి అనుమతిస్తుంది.

అమెరికా ఊరుకుంటుందా.?

రష్యా ఆఫర్ నేపథ్యంలో అమెరికా ఊరుకుంటుందా..? అనేది ఇక్కడ సమస్య. ఈ ఏడాది ప్రధాని వాషింగ్టన్ పర్యటనలో ట్రంప్ అమెరికా తయారీ 5వ తరం యుద్ధ విమానం ఎఫ్-35 ఫైటర్ జెట్‌ని ఆఫర్ చేశారు. అయితే, దీన్ని తయారు చేస్తున్న లాక్ హీడ్ మార్టిన్ మాత్రం మేక్ ఇన్ ఇండియా, సాంకేతిక బదిలీపై మాత్రం ఏం చెప్పడం లేదు. ఒకవేళ భారత్ రష్యా నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే, అమెరికా ‘‘కాట్సా’’ ప్రకారం ఆంక్షలు విధిస్తామని బెదిరించే అవకాశం ఉంది. యూకే, ఆస్ట్రేలియా వంటి మిత్రదేశాలతో కూడా F-35 యొక్క పూర్తి సోర్స్ కోడ్‌ను పంచుకోవడానికి US నిరాకరించింది.

భారత్‌కి ఐదో తరం అత్యవసరం:

భారత్‌కి ప్రస్తుతం ఐదో తరం యుద్ధ విమానాలు అత్యవసరం. ఇప్పటికే చైనా వద్ద J-20 మరియు FC-31 వంటి స్టెల్త్ ఫైటర్స్ ఉన్నాయి. వీటితో పోటీ పడాలంటే భారత్‌కి రష్యా లేదా అమెరికాకు చెందిన ఐదవ తరం ఫైటర్ జెట్స్ కావాలి. మరోవైపు, పాకిస్తాన్‌కి కూడా చైనా తన అధునాతన ఫైటర్ జెట్స్‌ని ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో సుఖోయ్ అభివృద్ధి చేసిన Su-57E ఫైటర్ జెట్ అమెరికన్ ఎఫ్-35, చైనీస్ జే-20కి సమాధానంగా ఉంటుంది. సూపర్ మ్యాన్యువరబిలిటీ, మాక్ 2 గరిష్ట వేగంతో కూడిన మల్టీరోల్ స్టీల్త్ ఫైటర్ ఇది. ఇది 10 టన్నుల వరకు ఆయుధాలను కలిగి ఉంటుంది, అత్యాధునిక రాడార్-ఎగవేత సాంకేతికతను కలిగి ఉంటుంది. స్టెల్త్‌లో ఇది పాశ్చాత్య జెట్‌ల కంటే వెనుకబడి ఉందని విమర్శలు ఉన్నప్పటికీ, ఇది చురుకుదనం, ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యం, కింజాల్ వంటి హైపర్‌సోనిక్ క్షిపణులను ప్రయోగించడంలో సత్తా చాటుతుంది. మరోవైపు, ఎఫ్-35ని కొనుగోలు చేస్తే అమెరికా సోర్స్ కోడ్‌ని ఇవ్వడానికి నిరాకరించవచ్చు . నేపథ్యంలో రష్యా ఆఫర్ భారత్‌కి కీలకం కానుంది. ఎఫ్-35 మెయింటనెన్స్ ఖర్చు కూడా చాలా అధికం.

Exit mobile version