Site icon NTV Telugu

UP: కాబోయే అల్లుడితో జంప్ అయిన ఎపిసోడ్‌లో అత్త తాజా ట్విస్ట్ ఇదే!

Up

Up

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన స్వప్న అనే మహిళ కాబోయే అల్లుడితో పారిపోయింది. 10 రోజుల్లో పెళ్లి అనగానే అల్లుడితో జంప్ అయిపోయింది. తాజాగా వీళ్లిద్దరూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా స్వప్న ఎందుకు వెళ్లిపోవల్సి వచ్చిందో పోలీసులకు వివరించింది. తన భర్త రోజు మద్యం తాగొచ్చి కొట్టేవాడని.. అంతేకాకుండా కుమార్తె కూడా తరచుగా గొడవ పడేదని.. దీంతో విసుగెత్తి కాబోయే అల్లుడు రాహుల్‌తో పారిపోయినట్లుగా చెప్పింది. ఇక జీవితం రాహుల్‌తోనే అని తెగేసి చెప్పింది. ఇంట్లో ఏమి తీసుకుని వెళ్లలేదని ఆమె చెప్పుకొచ్చింది. కేవలం మొబైల్, రూ.200 తీసుకెళ్లినట్లు చెప్పింది. ఇక రాహుల్‌ మాట్లాడుతూ.. చచ్చిపోతానని బెదిరించడంతోనే ఆమెతో వెళ్లినట్లుగా చెప్పుకొచ్చాడు. రాహుల్‌నే పెళ్లి చేసుకుంటానని ఆమె పదే పదే చెబుతుంటే.. అతడు మాత్రం దాటవేత ధోరణిలో కనిపించాడు.

ఇది కూడా చదవండి: Bhumana Karunakar Reddy: గోశాలకు వెళ్లేందుకు భూమనకు పోలీసుల అనుమతి!

స్వప్న-రాహుల్ ఏప్రిల్ 6న ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు షాక్‌కు గురయ్యాయి. తన భార్య స్వప్న రోజు రాహుల్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండేదని భర్త జితేంద్ర కుమార్ ఆరోపించాడు. గంటల తరబడి మాట్లాడేదని పేర్కొన్నాడు.

తాను చెప్పిన చోటికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్వప్న బెదిరించిందని రాహుల్ పేర్కొన్నాడు. భయపడే ఆమెతో వెళ్లినట్లు వాపోయాడు. అలీఘర్ బస్టాప్‌లో కలవాలని ఫోన్ చేసి బెదిరించిందని చెప్పుకొచ్చాడు. మొదట లక్నోకు.. అక్కడ నుంచి ముజఫర్‌పూర్‌కు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. పోలీసులు వెతుకుతున్నారన్న సమాచారంతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లుగా రాహుల్ తెలిపాడు. స్వప్నను పెళ్లి చేసుకుంటారా? అని అడిగితే మాత్రం అలాంటిదేమీ లేదన్నాడు. కొద్దిసేపటి తర్వాత చూస్తాను అంటూ దాటవేశాడు.

ఇక స్వప్న తమకు వద్దని.. తీసుకెళ్లిన నగలు, నగదు ఇచ్చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. అంతేకాకుండా ఆమెపై చర్య తీసుకోవాలని ఆమె సోదరుడు దినేష్ డిమాండ్ చేశాడు. భర్త కొడుతున్నాడన్న వార్తలను అతడు ఖండించాడు. నెలల తరబడి స్వప్న ఇంట్లో ఉన్నానని.. అలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని దినేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కేసుపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఇది కూడా చదవండి: Baahubali 1 : ప్రపంచ యాత్రలో మరో ఘట్టానికి చేరుకున్న ‘బాహుబలి’

Exit mobile version