Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీ నివాసానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..

Rss Chief Mohan Bhagwat, Pm Modi

Rss Chief Mohan Bhagwat, Pm Modi

PM Modi: ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. వరసగా సమావేశాలతో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు బిజీ బిజీగా ఉన్నారు. మంగళవారం, ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని ప్రధాని మోడీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. టైమ్, టార్గెట్, ప్లేస్ అంతా సైన్యానికే వదిలిపెట్టారు. ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకునే విషయంలో ఆయన సైన్యంపై పూర్తి నమ్మకం ఉంచుతున్నట్లు చెప్పారు.

ఈ సమావేశం తర్వాత, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీలోని 7, లోక్ లక్యాన్ మార్గ్‌లోని ప్రధాని మోడీ నివాసంలో ఆయనను కలిసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. వరసగా భేటీలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మరోవైపు పాకిస్తాన్ గుండెల్లో వణుకుపుట్టిస్తున్నాయి.

Read Also: Nabha Natesh : వాళ్లను క్షమించకూడదు.. పహల్గాం దాడిపై నభానటేష్..

26 మందిని బలితీసుకున్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీస్పందన తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పరిమిత మిలిటరీ యాక్షన్ ఉంటుందా..?, యుద్ధం తరహా పరిస్థితులు ఉంటాయా..? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరసగా ఢిల్లీలోని పరిణామాల బట్టి చూస్తే ఏదో పెద్దగా జరగబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే, ఈ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని తేలింది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌‌పై ప్రతీకారం కోసం చూస్తోంది.

భారత్ ఇప్పటికే పాకిస్తాన్‌కి తన దౌత్య దెబ్బ రుచి చూపిస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. సింధు నదిపైనే 80 శాతం పాక్ జనాభా ఆధారపడి ఉంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ దేశానికి సింధు జలాలే దిక్కు. ఇక పాకిస్తానీయులకు వీసాలు రద్దు చేసింది. అట్టారీ వాఘా బోర్డర్‌ని క్లోజ్ చేస్తున్నట్టు తెలిపింది.

Exit mobile version