RSS Magazine: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనుబంధ పత్రిక ‘ది ఆర్గనైజర్’ బీజేపీ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేసింది. గత నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ది ఆర్గనైజర్ బీజేపీ గెలుపోటముల గురించి ప్రస్తావిస్తూ సంపాదకీయం రాసింది. ఎన్నికల్లో గెలవడానికి మోడీ చరిష్మా, హిందుత్వ సరిపోదని స్పష్టం చేసింది.
ప్రాంతీయ స్థాయిలో బలమైన నాయకత్వం, సమర్థవంతమైన పనితీరు లేకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరిష్మా, హిందుత్వ ఎన్నికల్లో గెలవడానికి సరపోదని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ మ్యాగజైన్ ది ఆర్గనైజర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి గురించి ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించింది. బీజేపీ పరిస్థితిని సమీక్షించడానికి ఇది సరైన సమయం అని చెప్పింది. రాష్ట్రస్థాయిలో పాలన ఉన్నప్పుడు సానుకూల అంశాలు, భావజాలం, నాయకత్వం బీజేపీకి నిజమైన ఆస్తులు అని ఆర్గనైజరన్ మే 23న ప్రఫుల్ల కేత్కర్ సంపాదకీయంలో పేర్కొంది.
Read Also: Tamilnadu: దళితుల ప్రవేశానికి నిరాకరణ.. ఒక గుడికి సీల్, మరో ఆలయం తాత్కాలికంగా మూసివేత
బొమ్మై ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను సూచిస్తూ, ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నా, దిగ్భ్రాంతిని కలిగించేవి కాదని పేర్కొంది. ప్రధాని మోడీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కర్ణాటక ఎన్నికల్లో మాత్రమే బీజేపీ అవినీతి ఆరోపణలను సమర్థించుకోవాల్సి వచ్చిందని తెలిపింది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తాయని సంపాదకీయం పేర్కొంది.
జాతీయ స్థాయి నాయకత్వ పాత్ర తక్కువగా ఉన్నప్పుడు, స్థానిక స్థాయిలో ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్నికల్లో బాగా పనిచేస్తుందని ఆర్గనైజర్ సూచించింది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తన శక్తిని అంతా నిలిపి పోరాడింది. అయితే కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీలో విజయం సాధించింది. 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో 135 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. కేవలం 66 స్థానాలకు బీజేపీ పరిమితం అయింది.