LPG: దేశంలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక టెక్నాలజీని ప్రజలు వినియోగించుకుంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు మాత్రం ఇప్పటికీ ఎల్‌పీజీ వాడకుండా.. ఇంకా కట్టెల పొయ్యినే వాడుతున్నారు. ఎల్‌పీజీ సిలిండర్ ఇంట్లో ఉన్నప్పటికీ వాటిని వాడకుండా.. కట్టెలపొయ్యినే వాడుతున్నారు. అందుకు కారణం రోజు రోజుకు పెరుగుతున్న ఎల్‌పీజీ వంట గ్యాస్ ధరే కారణమని తేలింది. దేశంలోని నిరు పేదలకు వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడం భారంగా మారిందని.. దానితోపాటు దరఖాస్తు ప్రక్రియలోని సమస్యలు, సిలిండర్ డెలివరీలోని లోపాలు, ఫిర్యాదులు చేస్తే పరిష్కరించే యంత్రాంగం లేకపోవడంతో .. గ్రామీణ పేదలు వంట గ్యాస్ (ఎల్‌పీజీ) వాడటానికి విముఖత చూపడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఒక సర్వేలో వెల్లడయింది. పేదలు వంట గ్యాస్ వాడకపోవడానికి గల కారణాలపై క్లీన్ ఎయిర్ అండ్ బెటర్ హెల్త్ (సీఏబీహెచ్) ప్రాజెక్టు సర్వే జరిపింది. ఈ అధ్యయనంలో అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ఏఐడీ) కూడా పాలుపంచుకుంది.
Read also: Shravana Masam 2023: శ్రావణ మాసం చివరి సోమవారం ఈ 3 చర్యలు చేస్తే.. మీ కోరికలు ఫలిస్తాయి!
దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించాలని.. కట్టెల పొయ్యి వాడకాన్ని బంద్ చేయించి ఎల్‌పీజీ వాడకాన్ని పెంపొందించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 2016 నుంచి ఈ ఏడాది మార్చి వరకు దేశవ్యాప్తంగా సుమారు 9.59 కోట్ల అల్పాదాయ కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు. అయితే గ్రామీణ నిరుపేదలు నిరంతరం గ్యాస్‌ను వినియోగించుకోగలిగే స్థాయిలో వంట గ్యాస్ సిలిండర్ ధర అందుబాటులో లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉండే ఆర్థిక ఇబ్బందులతోపాటు ఎల్పీజీ రీఫిల్ ధరలు మండిపోతుండటంతో ఇప్పటికీ 41 శాతం కుటుంబాలు వంట కోసం కట్టెలపొయ్యినే ఉపయోగిస్తున్నట్టు సర్వేలో తేలింది. జార్ఖండ్‌లో అత్యధికంగా 67.8 శాతం కుటుంబాలు వంట కోసం కట్టెలు ఇతర వంట చెరకును ఉపయోగిస్తున్నట్టు తేలింది. వంట చెరకు వినియోగం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలపై అవగాహన లేకపోవడంతోపాటు.. ఎల్పీజీ ధర, భద్రత, వంటల రుచి తదితర అంశాలు అల్పాదాయ కుటుంబాల్లో గ్యాస్ వినియోగానికి ప్రతిబంధకాలుగా నిలుస్తున్నట్టు సర్వేలో వెల్లడయింది. జార్ఖండ్‌లో 67.8శాతం మంది పేదలు కట్టెలను వాడుతుండగా.. ఢిల్లీలో అతి తక్కువగా 0.8శాతం మందే కట్టెల పొయ్యిలను వాడుతున్నారు. సులభంగా అందుబాటులో ఉన్న వాటినే వంటకు పేదలు వినియోగిస్తున్నారు. చాలా మందికి ఎల్‌పీజీవల్ల వాయు కాలుష్యం తగ్గుతుందనే విషయమే తెలియదు. ఇండ్లలో వాయు కాలుష్యం వల్ల తలెత్తే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని సంస్థ తెలిపింది.