Site icon NTV Telugu

Rishabh Pant: రిషభ్ పంత్ ఆరోగ్యంపై అప్డేట్.. వైద్యులు ఏం చెప్తున్నారంటే..

Rishabh Pant Health

Rishabh Pant Health

Rishabh Pant Health Condition: నిన్న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతని ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రిషభ్‌కు డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతోంది. మెదడు లేదా వెన్నుకు ఎటువంటి గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు. ఈరోజు అతనికి మరోసారి ఎమ్ఆర్ఐ సహా పలు పరీక్షలు జరపనున్నారు. అటు ప్రధాని మోడీ నిన్న రాత్రి రిషబ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. రిషబ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బీసీసీఐ సైతం రిషబ్ ఆరోగ్య పరిస్థితిపై అతని కుటుంబం, వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.

కాగా.. శుక్రవారం రాత్రి ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వస్తున్న సమయంలో రిషభ్ పంత్ కారు అదుపు తప్పి రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రిషభ్ కారు ధ్వంసం అవ్వగా.. రిషబ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అతని నుదిటిపై, మోకాలికి, వీపుపై, కుడి మణికట్టు, బొటనవేలుకి గాయాలయ్యాయి. నిద్రమత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ ఒక్కడే కారులో ఉన్నాడని, కారు అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చాడు. దురదృష్టం ఏమిటంటే.. ప్రమాదం జరిగిన తర్వాత రిషభ్‌కి సహాయం చేస్తున్నట్టు నటిస్తూ, కొందరు దుండగులు అతడ్ని దోపిడీ చేశారు.

మరోవైపు, రిషభ్ పంత్ యాక్సిడెంట్ గురించి సుశీల్ అనే బస్సు డ్రైవర్ మాట్లాడుతూ.. ‘‘పంత్ కారు డివైడర్‌ను ఢీకొని దాదాపు 200 మీటర్లు దూసుకెళ్లింది. వెంటనే నా బస్సును రోడ్డు పక్కన ఆపేసి, ప్రమాదం జరిగిన కారు వద్దకు వెళ్లాను. పంత్‌ అప్పటికే కారు విండో నుంచి సగం బయటకు వచ్చాడు. తానొక క్రికెటర్‌నని, తన తల్లికి ఫోన్‌ చేయమని పంత్ కోరాడు. నేను క్రికెట్‌ చూడను కాబట్టి పంత్‌ని గుర్తుపట్టలేకపోయాను. అతడిని వెంటనే బయటకు లాగి.. కారులో ఇంకెవరైనా ఉన్నారేమో చూశాను. అతడి నీలం రంగు బ్యాగ్‌, రూ.7,000 నగదును గుర్తించి, వాటిని అంబులెన్స్‌లో అతడికి అప్పగించాం’’ అని పేర్కొన్నాడు.

Exit mobile version