NTV Telugu Site icon

Prophet row: బెంగాల్‌లో రెండో రోజు అల్లర్లు.. రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు

Bengal Min

Bengal Min

మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం దేశవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. దేశంలోని నగరాలు, పట్టణాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్‌శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో బెంగాల్‌లో రెండో రోజు కూడా అల్లర్లు జరిగాయి. హౌరా జిల్లాలో కొందరు నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేశారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

పాంచ్లా బజార్‌లో పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. జూన్ 15 దాకా నిషేధాజ్ఞలను అమలు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇంటర్నెట్‌ను 13 దాకా సస్పెండ్ చేశారు. ప్రజలెవరూ అల్లర్లలో భాగం కారాదని, రెచ్చగొట్టే చర్యలకు పూనుకోకూడదని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అల్లర్లు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దన్నారు. ప్రస్తుతం హౌరాలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు.