NTV Telugu Site icon

Himanta Biswa Sarma: ‘‘ రైట్-వింగ్ నాయకులే లక్ష్యం’’.. ట్రంప్ హత్యాయత్నంపై అస్సాం సీఎం..

Himanta

Himanta

Himanta Biswa Sarma: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంపై ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. నిన్న పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై 20 ఏళ్ల థామస్ మథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో అద‌‌‌ృష్టవశాత్తు బుల్టెట్ ఆయన చెవిని తాకుతూ వెళ్లింది. స్వల్పంగా గాయమైంది. ఈ దాడిలో ఇద్దరు గాయపడగా, ఒకరు మరణించారు. దాడి తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ నిందితుడిని హతమార్చారు.

Read Also: Vivek Ramaswamy: “ట్రంప్‌ని దేవుడే రక్షించాడు”..భారతీయ అమెరికన్ వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే, ఈ దాడిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా రైట్-వింగ్ నాయకులు క్రియాశీలక లక్ష్యాలుగా ఉన్నారని అన్నారు. రాడికల్ లెఫ్ట్ వీరిని టార్గెట్ చేస్తుందని దుయ్యబట్టారు. ఈ దాడులు ‘‘ దేశం మొదలు’’ అనే సిద్ధాంతాన్ని ఓడించలేదని చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మితవాద నాయకులు ఇప్పుడు రాడికల్ లెఫ్ట్ క్రియాశీలక లక్ష్యాలుగా ఉన్నారు. అయితే ఈ దాడులు ‘‘నేషన్ ఫస్ట్’’అనే భావజాలాన్ని ఓడించలేదు. ఇది లోతైన ఆధ్యాత్మికతలో పాతుకుపోయింది. సనాతన తత్వశాస్త్రం నుంచి ప్రేరణ పొందింది. ‘జననీ జన్మభూమి చ స్వర్గాదపి గరీయసీ’ ’’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. స్టాండ్ విత్ ట్రంప్, నేషన్ ఫస్ట్ హ్యాష్ ట్యాగ్‌లను జోడించారు.

ట్రంప్‌పై జరిగిన దాడిని ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అన్నారు. ‘‘ నా స్నేహితుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో మరియు ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అంటూ మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.