Site icon NTV Telugu

Arvind Kejriwal: దేశం కోసం 100 సార్లు జైలుకు వెళ్లేందుకు సిద్ధం, అందుకు గర్వపడుతున్నా..

Arvind Kejriewal

Arvind Kejriewal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే పంజాబ్ జలంధర్‌లో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తన దేశాన్ని రక్షించేందుకు జైలుకు వెళ్లడానికి సిద్ధమని, ఇందుకు గర్వంగా ఉందని చెప్పారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్‌తో తనను తాను పోల్చుకుంటూ.. నేను భగత్ సింగ్ అనుచరుడిని, దేశాన్ని రక్షించేందుకు 100 సార్లు జైలుకు వెళ్లవలిసి వస్తే వెళ్లాను అని అన్నారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలుబడిన తర్వాత బీజేపీకి 200 కంటే తక్కువ సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 300 సీట్లు కన్నా ఎక్కువ వస్తాయని కేజ్రీవాల్ చెప్పారు.

Read Also: Miss Vizag : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న నటుడు.. అడ్డంగా బుక్ చేసేసిందిగా!

కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని బీజేపీ వాళ్లు చెబుతున్నారు, దీనికి సంబంధించి వారి వద్ద ఒక్క రుజువు కూడా లేదని, ఒక వేళ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడినట్లైతే ఈ ప్రపంచంలో ఎవరూ నిజాయితీపరులు కాదన్నారు. రూ. 100 కోట్ల అవినీతి జరిగినట్లు చెబుతున్నారు, 500 చోట్ల దాడులు నిర్వహించినా ఒక్క పైసా కూడా పట్టుబడలేదు. రూ. 100 కోట్లు గాలిలో మాయమైపోయాయా..? అని ప్రశ్నించారు. ‘‘కేజ్రీవాల్‌కి సంబంధించి ఎలాంటి ఆధారాలు పట్టుబడలేదని ప్రధానిని ప్రశ్నిస్తే, ఆయన తమ వద్ద ఎటువంటి రుజువు లేదని, రికవరీ లేదని, కేజ్రీవాల్ అనుభవజ్ఞుడైన దొంగ అని ప్రధాని అంగీకరించారు. దేశం మొత్తం ముందు తమ వద్ద ఎటువంటి రుజువు లేదని ప్రధాని అంగీకరిస్తే, మొత్తం కేసు నకిలీదని అర్థం’’ అని కేజ్రీవాల్ అన్నారు.

పంజాబ్, ఢిల్లీల్లో ప్రజలకు తాను ఉచింతంగా విద్యుత్ అందించానని, ప్రజల కోసం మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేశానని అందుకే వారు తనను జైలులో పెట్టాలని చూస్తున్నారంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. వారు తనను సైలెంట్ చేయాలని అనుకుంటున్నారు, కానీ ప్రపంచంలోని ఏ శక్తి తనను అడ్డుకోలేదని ఆప్ చీఫ్ అన్నారు. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, నా దేశాన్ని రక్షించుకోవడానికి జైలుకు వెళ్లేందుకు గర్వపడుతున్నానని చెప్పారు. పంజాబ్‌లో భగవంత్ మాన్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, 3 కోట్ల పంజాబ్ ప్రజల్ని బెదిరించడమే అని చెప్పారు.

Exit mobile version