Rameshwaram Cafe: బెంగళూర్‌లోని ప్రముఖ రెస్టారెంట్ అయిన రామేశ్వరం కేఫ్ ఓనర్లపై కేసు నమోదైంది. నిఖిల్ అనే ప్రయాణికుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కల్తీ ఆహారం, తప్పుడు బెదిరింపులు కేసు పెట్టినందుకు దాని యజమానులు రాఘవేంద్ర రావు, దివ్య రాఘవేంద్ర రావులతో పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుమంత్ లక్ష్మీ నారాయణలపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే నిఖిల్ అనే ప్రయాణికుడు జూలై 24న బెంగళూర్ నుంచి గౌహతి వెళ్తున్న సమయంలో కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1లో ఉన్న రామేశ్వరం కేఫే అవుట్ లెట్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు ఆడాడు. నిఖిల్, అతడి స్నేహితులు వెన్ పొంగల్, ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేశారు.
అయితే, పొంగల్‌లో వార్మ్ పురుగు కనిపించింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై వేరే ప్లేట్ ఇస్తామని చెప్పారు. నిఖిల్‌కు అప్పటికే విమానం సమయం దగ్గర పడటంతో దీనిని తిరస్కరించి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అనేక మంది కస్టమర్లు, పొంగల్‌లో పొరుగు ఉన్న చిత్రాలను తమ కెమెరాల్లో బంధించారు. ఇదిలా ఉంటే, రామేశ్వరం కేఫ్ ప్రతినిధి సుమంత్ బీఎల్ అనే వ్యక్తి, నిఖిల్ రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, కేఫ్ బ్రాండ్ ప్రతిష్టలను దెబ్బతీస్తానని బెదిరించినట్లు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.
నిఖిల్ తాను ఎలాంటి ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేయలేదని, రామేశ్వరం కేఫ్ ప్రతినిధి తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పాడు. కేఫ్ ఫిర్యాదులో పేర్కొన్న సమయంలో ఉదయం 10.27 గంటలకు తాను విమానంలోనే ఉన్నానని చెప్పారు. రుజువులుగా తన బోర్డింగ్ పాస్, ప్రయాణ రికార్డుల్ని సమర్పించారు. దీంతో పాటు కేఫ్ ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్ నెంబర్లతో తనకు సంబంధం లేదని వెల్లడించాడు. ఆధారాలు పరిశీలించిన పోలీసులు, నిఖిల్‌కు ఈ ఆరోపణలతో సంబంధం లేదని తేల్చారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు, ఆహార భద్రత ఉల్లంఘనలకు పాల్పడినందుకు నిఖిల్ ఫిర్యాదు చేస్తూ, రామేశ్వరం కేఫ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
