Sonia Gandhi Book: అయోధ్య రామమందిర వివాదం భారత రాజకీయాలను మలుపుతిప్పిన సంఘటనల్లో ఒకటి. రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంలోకి కాంగ్రెస్ ఎలా ఎంట్రీ ఇచ్చింది, ఏ పరిస్థితుల్లో బాబ్రీ మసీదు తాళాలు తెరిచేందుకు రాజీవ్ గాంధీ అనుమతి ఇచ్చారనే దానిపై సోనియా గాంధీ తన ఆత్మకథ Belonging: A Journey of Love కీలక విషయాలు వెల్లడించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముందుకు తెచ్చిన రామమందిర రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా మహాత్మా గాంధీ ప్రతిపాదించిన ‘‘రామరాజ్యం’’ భావనను ముందుకు తీసుకురావడానికి రాజీవ్ గాంధీ ప్రయత్నించారని సోనియా పుస్తకంలో పే ర్కొంది. అయితే, ఈ చర్య ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని, ఆర్ఎస్ఎస్ ప్రచారమే పైచేయి సాధించిందని ఆమె అభిప్రాయపడ్డారు.
బాబ్రీ తాళాలు తెరవడం వెనక రాజీవ్ ఆలోచన ఇదే..
సోనియా గాంధీ తన ఆత్మకథలో, 1986లో బాబ్రీ మసీదు తాళాలు తెరవడం కీలక మలుపుగా అభివర్ణించారు. ఫైజాబాద్ జిల్లా కోర్టు స్థితిగతులను మార్చి తాళాలు తెరవాలని ఆదేశించిందని, తీర్పు వెలువడిన గంటలోనే మసీదు తలుపులు తెరుచి భక్తుల్ని లోపలికి అనుమతించారని ఆమె రాశారు. ఈ పరిణామం నిద్రాణంలో ఉన్న సమస్యని మళ్లీ పెద్దది చేసినట్లు చెప్పారు. అయోధ్య అంశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ తన రాజకీయ ఉద్యమాన్ని విస్తరించుకునేందుకు అవకాశంగా మార్చుకున్నాయని చెప్పారు.
అయితే, రాజీవ్ గాంధీ మాత్రం మసీదుకు నష్టం కలుగకుండా ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని భావించారని సోనియా పుస్తకంలో రాశారు. ఆ తర్వాత పరిణామాల్లో బీజేపీ-ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా వేరుగా ఉందని, చివరకు మసీదు కూల్చివేత వరకు వెళ్లిందని ఆమె రాశారు.
షాబానో కేసుతో రాజీవ్ గాంధీకి ఇబ్బందులు..
రాజీవ్ గాంధీ ప్రభుత్వం అయోధ్య అంశంలోకి ఎలా వెళ్లాల్సి వచ్చిందో సోనియా గాంధీ చెప్పారు. 1985లో సుప్రీంకోర్టు విడాకులు పొందిన ముస్లిం మహిళ షాబానోకు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో సెక్షన్ 125 ప్రకారం, మాజీ భర్త నుంచి భరణం పొందే హక్కు ఉందని తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పు తమ వ్యక్తిగత చట్టాల్లో జోక్యం చేసుకోవడమే అని ముస్లిం వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీంతో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ముస్లిం మహిళల (విడాకులు హక్కుల పరిరక్షణ) చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభావం పడింది. ఈ నిర్ణయంపై మేధావులు, మహిళల రాజీవ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ‘‘ముస్లిం బుజ్జగింపు’’ రాజకీయాలకు పాల్పడుతుందనే హిందువులు విమర్శలు చేయడం ప్రారంభమైంది.
1984 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ హత్య అనంతరం ఏర్పడిన సానుభూతి ప్రభావంతో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. మొత్తం 514 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 404 సీట్లు గెలుచుకుంది. 1989 లోక్‌సభ ఎన్నికల్లో 197 సీట్లకే పరిమితమైంది. అయితే, షాబానో కేసు, రామమందిరంపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత హిందూ ఓటర్లలో అసంతృప్తికి కారణం కావడంతో కాంగ్రెస్ గెలుపు పై ప్రభావం పడింది.
బాబ్రీ తాళాలు తెరవడం వెనక అరుణ్ నెహ్రూ సూచన.?
బాబ్రీ తాళాలు తెరవడం వెనకు రాజీవ్ గాంధీ సన్నిహితుడైన అరుణ్ నెహ్రూ పాత్ర కీలకమని సీనియర్ జర్నలిస్టు నీరజా చౌధురి తన How Prime Ministers Decide పుస్తకంలో వివరించారు.1986 జనవరి 18న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) అధిపతులు రాజీవ్ గాంధీని కలిశారు. షాబానో కేసు హిందువుల్లో అసంతృప్తికి కారణమైందిన నివేదిక ఇచ్చినట్లు చౌధురి పేర్కొన్నారు. దీనిని అడ్డుకోవడానికి అయోధ్యలోని వివాదాస్పద స్థలానికి హిందూ భక్తుల్ని అనుమతించి, పూజలు చేసుకునే అవకాశం కల్పిస్తే హిందూ ఓటర్లలో కోపం తగ్గుతుందని అరుణ్ నెహ్రూ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.
బాబ్రీ మసీదు తాళాలు ఎలా తెరుచుకున్నాయి.?
1949 డిసెంబర్లో బాబ్రీ మసీదు లోపల రాముడు, సీత విగ్రహాలు ఉంచిన తర్వాత ఆ నిర్మాణాన్ని వివాదాస్పద స్థలంగా పరిగణించారు. దానికి తాళాలు వేశారు. హిందూ భక్తులు మాత్రం తాళం వేసిన గేట్ల బయట నుంచి పూజలు చేసేందుకు అనుమతించబడ్డారు.
ఈ స్థలంలోకి ప్రవేశించి పూజలు చేసుకునే అవకాశం కల్పించాలంటూ విశ్వహిందూ పరిషత్ (VHP) ఉద్యమాన్ని పెద్దది చేసింది. అయోధ్య వివాదంపై అప్పటి యూపీ సీఎం వీర్ బహదూర్ సింగ్ కూడా దృష్టిసారించారు. 1985 డిసెంబర్లో ఆయన అయోధ్యను సందర్శించి, వివాదానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించినట్లు నీరజా చౌధురి తన పుస్తకంలో రాశారు. తాళాలు వేయడానికి నిర్దిష్ట న్యాయస్థాన ఆదేశం కాకుండా పరిపాలనా ఉత్తర్వే కారణమని వీర్ బహదూర్ సింగ్ భావించినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం అరుణ్ నెహ్రూ ద్వారా ముఖ్యమంత్రికి సందేశం వెళ్లిందని, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి తాళాలు తెరిపించాలని సూచించినట్లు వివరించారు.
1986 ఫిబ్రవరి 1న ఫైజాబాద్ జిల్లా కోర్టు బాబ్రీ మసీదు గేట్ల తాళాలు తెరవాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన గంటలోపే తాళాలు తెరిచి భక్తులను లోపలికి అనుమతించారు. ఇంత త్వరగా పరిణామాలు మారిపోవడం కూడా రాజకీయ వివాదానికి కారణమైంది.

