Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!

  • పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్
  • ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్
  • 34 ఏళ్ల సర్వీస్ తర్వాత గుర్తించిన అధికారులు
Rajasthan

Rajasthan

గురువు అనేవాడు సమాజానికి మార్గదర్శి అంటారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. సన్మార్గంలో నడిపించేవాడు పంతులు. అలాంటి పండితులే దారి తప్పితే.. సమాజం ఏం బాగుపడుతుంది. ఇదంతా ఎందుకుంటారా? పదవీ విరమణకు ఒకరోజు ముందు ఓ ఉపాధ్యాయుడి నకిలీ బండారం బయటపడింది. నకిలీ పత్రాలతో ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించి.. 34 ఏళ్లు సర్వీసులో కొనసాగి.. కొన్ని గంటల్లో రిటైర్మెంట్ అనగా.. నకిలీ అని తేలడంతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. అసలేం జరిగింది? తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో లక్ష్మీనారాయణ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. జూన్ 30న అనగా మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. 1992లో బగిడోరా ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. దాదాపు 34 ఏళ్లు సర్వీసులో కొనసాగాడు. ఈరోజు పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అనూహ్యంగా సోమవారం ఉద్యోగాన్ని కోల్పోయాడు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చగా మారింది. ఆన్‌లైన్ పోర్టర్‌లో అందిన ఫిర్యాదు ఆధారంగా విద్యాశాఖ దర్యాప్తు చేపట్టగా నకిలీ మార్క్‌షీట్‌తో లక్ష్మీనారాయణ్ ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా గుర్తించారు. దీంతో లక్ష్మీనారాయణ్‌ను జూన్ 29న ఉద్యోగం నుంచి అధికారులు తొలగించారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

అపాయింట్‌మెంట్ సమయంలో లక్ష్మీనారాయణ్ నకిలీ మార్క్ షీట్ ఇచ్చినట్లుగా గుర్తించారు. నియామక సమయంలో సమర్పించిన మార్క్ షీట్లు నకిలీవని వెల్లడైంది. లక్ష్మీనారాయణ్ తన సెకండరీ, హయ్యర్ సెకండరీ, ఎస్‌టిసి పరీక్షల కోసం నకిలీ పత్రాలను సమర్పించాడు. థర్డ్ క్లాస్‌లో పాసై.. మొదటి డివిజన్ అని చెప్పుకుని ఉద్యోగం సంపాదించాడు. విచారణలో ఆ ఉపాధ్యాయుడు సెకండరీ, హయ్యర్ సెకండరీ పరీక్షలు రెండింటిలోనూ థర్డ్ డివిజన్ మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడని తేలింది. అయితే నియామక పత్రాల్లో ఫస్ట్ డివిజన్ అని పేర్కొనబడింది. బికనీర్ విద్యాశాఖ దగ్గర ఎస్టీసీ పరీక్షకు సంబంధించిన ఎలాంటి రికార్డులు లేకపోవడంతో ఆ పత్రాలు నకిలీవని వెల్లడైంది.

జిల్లా నియామక కమిటీ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. మోసం జరిగినట్లు నిర్ధారణ అయిన తర్వాత.. రాజస్థాన్ పంచాయతీ రాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 91(3) కింద చర్యలు ప్రారంభించారు. జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ.. జూన్ 29వ తేదీనే లక్ష్మీనారాయణ్‌ను తక్షణమే ప్రభుత్వ సేవ నుంచి తొలగించాలని శాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయుడి పత్రాలు నకిలీవని తేలిన తర్వాత విచారణ జరిపినట్లు జిల్లా పరిషత్ అధికారులు తెలిపారు. నకిలీ పత్రాల ఆధారంగా ప్రభుత్వ సేవలో చేసే ఏ నియామకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. ప్రభుత్వ నియామకాలలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూసేందుకు ఈ చర్య తీసుకున్నారు.