Rajasthan Man Kills Wife To Get ₹ 1.90 Crore Insurance Amount: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తన భార్యనే హత్య చేసి బీమా డబ్బులు పొందాలని పథకం వేశాడు. అయితే మరణంపై అనుమానం రావడంతో ఈ కుట్ర బయటపడింది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య పేరుపై ఇన్సూరెన్స్ చేయించాడు. ఆమె ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.9 కోట్లు వస్తాయనే ఆశతో ఆమెను కిరాయి వ్యక్తితో హత్య చేయించాడు. ఆమె ప్రయాణిస్తున్న బైకును కారుతో ఢీకొట్టించి హత్య చేయించాడు.
బుధవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు పోలీసులు. అక్టోబర్ 5న ఈ ఘటన జరిగింది. భర్త మహేష్ చంద్, తన భార్య షాటును హత్య చేయించాడు. మహేష్ చంద్ అభ్యర్థన మేరకు షాలు తన బంధువైన రాజుతో కలిసి బైకుపై గుడికి వెళ్తుండగా తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో వారి బైకును కారుతో ఢీకొట్టించాడని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో షాలు అక్కడిక్కడే మరణించింది. ఆమె బంధువు చికిత్స పొందుతూ మరణించాడు.
Read Also: Gujarat Elections: గుజరాత్ తొలి పోరు నేడే.. 89 స్థానాలకు పోలింగ్
అయితే ఈ ఘటనపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. భర్త మహేష్ చంద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసమే భార్యను హత్య చేయించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మహేష్ చంద్ తన భార్య పేరుతో 40 ఏళ్లకు గానూ బీమా చేయించాడు. సహజమరణం పొందితే రూ. 1 కోటి, ప్రమాదంలో మరణిస్తే రూ.1.9 కోట్లు వచ్చేలా ఇన్సూరెన్స్ చేయించాడు. ఆ డబ్బు కోసమే భార్య షాలును హత్య చేయించాడు. ఈ హత్య కోసం రౌడీ షీటర్ ముఖేష్ సింగ్ రాథోడ్ తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ గా రూ. 5.5 లక్షలు ఇచ్చాడు మహేష్ చంద్.
మహేష్ చంద్, షాలులకు 2015లో వివాహం అయింది. వీరికి ఒక కుమార్తే కూడా ఉంది. అయితే పెళ్లయిన రెండేళ్ల తర్వాత వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. 2016లో మహేష్ చంద్ పై గృహహింస కేసు కూడా పెట్టింది షాలు. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో భార్య పేరుతో ఇన్సూరెన్స్ చేశాడు మహేష్. అయితే తాను ఓ కోరిక కోరానని.. అది నెరవేరాలంటే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా 11 రోజుల పాటు హనుమాన్ మందిరానికి వెళ్లాలని భార్య షాలుకు చెప్పాడు మహేష్ చంద్. తన కోరిక నెరవేరగానే ఆమెను ఇంటికి తీసుకెళ్తా అని చెప్పాడు. భర్త మాటలను నమ్మిన భార్య గుడికి వెళ్తున్న సమయంలో కారుతో ఢీకొట్టి చంపించాడు మహేష్. ఈ కేసులో రౌడీ షీటర్ రాథోడ్ తో పాటు కారు యజమానులు రాకేష్ సింగ్, సోనూలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.