ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ తో పాటు వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు రాజస్థాన్ కూడా అడుగులు వేస్తున్నది. రాజస్థాన్‌లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో 5660 కొత్త కేసులు నమోదవ్వగా ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో 19,467 యాక్టీవ్ కేసులు ఉండగా, 24 గంటల్లో 358 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అశోక్ గెహ్లాట్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉన్నది.
Read: ఢిల్లీలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు…
కాగా, ఇప్పుడు వీకెండ్ కర్ఫ్యూను కూడా విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. శనివారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యాసంస్థలను జనవరి 30 వరకు మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించుకోవడానికి అనుమతులు మంజూరు చేశారు. అదేవిధంగా వివాహాలకు 50 మందికి మించి హాజరుకాకూడదని రాజస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంత్యక్రయలకు 20 మందిని పరిమితం చేసింది. సినిమా హాళ్లను 50 శాతం సీటింగ్‌తో నడిచేలా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
